తెలంగాణ సుభిక్షంగా ఉండాలి : మంత్రి వాకిటి శ్రీహరి

తెలంగాణ సుభిక్షంగా ఉండాలి :  మంత్రి వాకిటి శ్రీహరి
  • ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలను అందజేసిన మంత్రి వాకిటి శ్రీహరి

అలంపూర్, వెలుగు: ఎల్‌‌‌‌‌‌‌‌నినో ప్రభావం తగ్గి, రైతులు, ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు తొలగి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని జోగులాంబ అమ్మవారిని ప్రార్థించినట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. శుక్రవారం దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అలంపూర్‌‌‌‌‌‌‌‌లోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయాన్ని కుటుంబ సమేతంగా సందర్శించిన మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా బాల బ్రహ్మేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

అనంతరం జోగులాంబ అమ్మవారికి పూజలు చేశారు. ఆలయ అర్చకులు మంత్రికి ప్రసాదం అందించి ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మవారు మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అనుకూల వాతావరణం నెలకొని సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులు మంచి దిగుబడులు సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ సరిత, ఆలయ ఈవో దీప్తి, స్థానిక ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.