- కిందటి నెల అమ్ముడైన కార్లలో 21.9 శాతం ఈవీలే
- మొదటి స్థానంలో ఢిల్లీ..మూడో ప్లేస్‌లో ఒడిశా
- నోమురా రిపోర్ట్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు : దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వాడకం వేగంగా పెరుగుతుండగా, ఇందులో తెలంగాణ ముందు వరుసలో ఉంది. ప్యాసింజర్ కార్ల విభాగంలో అత్యధిక ఈవీల అమ్మకాలతో దేశవ్యాప్తంగా రెండో స్థానాన్ని దక్కించుకుంది. జపాన్‌కు చెందిన బ్రోకరేజ్ సంస్థ నోమురా విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో తెలంగాణలో అమ్ముడైన మొత్తం ప్యాసింజర్ కార్లలో ఎలక్ట్రిక్ కార్ల వాటా ఏకంగా 21.0 శాతానికి చేరింది. 21.9 శాతంతో దేశ రాజధాని ఢిల్లీ మాత్రమే తెలంగాణ కంటే స్వల్పంగా ముందుండగా, 17 శాతంతో ఒడిశా మూడో స్థానంలో నిలిచింది.
మన రాష్ట్రంలో మౌలిక వసతులు మెరుగ్గా ఉండడం, ఇంధన ఖర్చులు పెరగడం వంటి కారణాలతో ఇక్కడ ప్రజలు ఈవీలకు మొగ్గు చూపుతున్నారు. ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు సెప్టెంబర్‌లో ఒడిశా (23 శాతం), కర్నాటక (19.3 శాతం) , గోవా (17.5 శాతం)లలో ఎక్కువగా జరగగా, వీటి అమ్మకాల్లో 25 శాతం వాటా ఎలక్ట్రిక్ స్కూటర్లదే ఉంది. ఎలక్ట్రిక్ త్రీవీలర్ అమ్మకాల్లో త్రిపుర, అస్సాం టాప్‌లో ఉన్నాయి.
దేశవ్యాప్తంగా జోరు
కేవలం తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈవీ రంగం ఒక కీలక మలుపునకు చేరిందని నోమురా స్పష్టం చేసింది. సెప్టెంబర్ నెలలో దేశంలో అమ్ముడైన మొత్తం టూ-వీలర్లలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకుల వాటా 11.6 శాతానికి ఎగబాకింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది కేవలం 6.5 శాతమే. కార్ల విభాగంలో ఈవీల వాటా 4 శాతం నుంచి 7.9 శాతానికి రెట్టింపు అయ్యింది. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి కార్ల అమ్మకాల్లో 12.7 శాతం, టూవీలర్లలో 22 శాతం, త్రీ-వీలర్లలో ఏకంగా 70 శాతం ఈవీలే ఉంటాయని నోమురా రిపోర్ట్ అంచనా వేస్తోంది.
పెట్రోల్ భారంతో ఈవీల వైపు
పశ్చిమాసియా సంక్షోభం తర్వాత అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 103 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి. దీంతో డిసెంబర్ 2025 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్ 8శాతం, డీజిల్ 9శాతం, సీఎన్జీ ధరలు 13శాతం మేర పెరిగాయి. రాబోయే రోజుల్లో లీటరు పెట్రోల్‌పై మరో రూ.5 నుంచి రూ.7 వరకు పెరిగే అవకాశం ఉండటంతో వినియోగదారులు ఈవీల వైపు మొగ్గుచూపుతున్నారు.
ఎలక్ట్రిక్ బండ్ల కొనుగోలు ధర కాస్త ఎక్కువే అయినా, వీటి నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. ఉదాహరణకు సాధారణ పెట్రోల్ స్కూటర్ తిరగడానికి కిలోమీటర్‌కు సుమారు రూ.2.60 ఖర్చవుతుండగా, ఈవీ స్కూటర్‌కు అయ్యే ఖర్చు కేవలం 30 పైసలు (రూ. 0.30) మాత్రమే. టాటా పంచ్ పెట్రోల్ మోడల్ కిలోమీటర్‌కు రూ.7.40 ఖర్చు చేస్తే, ఈవీ మోడల్‌కు కేవలం రూ.1.32 మాత్రమే అవుతోంది.
విస్తరిస్తున్న చార్జింగ్ కేంద్రాలు
దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో ఈవీ చార్జింగ్ కేంద్రాల సంఖ్య సెప్టెంబర్ 2022 నాటి 4,100 నుంచి జూన్ 2026 నాటికి 29,500కి చేరింది. త్రీవీలర్ విభాగంలో ఇప్పటికే 50 శాతానికి పైగా ఎలక్ట్రిక్ ఆటోలే అమ్ముడవుతుండగా, ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, అస్సాంలో ఇది 96 శాతాన్ని దాటింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026–27లో భారత్‌లో 3.8 లక్షల ఎలక్ట్రిక్ కార్లు, 24 లక్షల ఎలక్ట్రిక్ టూ-వీలర్లు అమ్ముడవుతాయని నోమురా తెలిపింది.
