- 38,737 మంది శాశ్వత ఉద్యోగుల ఖాతాల్లో రూ.596.20 కోట్లు జమ
- కాంట్రాక్ట్ కార్మికులకు త్వరలోనే జమ చేస్తామని సింగరేణి ఆఫీసర్ల వెల్లడి
హైదరాబాద్, వెలుగు: సింగరేణి కార్మికులకు దసరా కానుకగా ప్రభుత్వం 34 శాతం లాభాల బోనస్అందజేసింది. శుక్రవారం 38,737 మంది శాశ్వత ఉద్యోగులకు ఒక్కొక్కరికి సగటున రూ. 1,53,912 చొప్పున మొత్తం రూ.596.20 కోట్లను వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఇంకా 29,717 మంది కాంట్రాక్ట్ కార్మికులకు రూ. 5,500 చొప్పున చెల్లించాల్సిన బోనస్ డబ్బులు రూ.16.34 కోట్లను త్వరలోనే వారి ఖాతాల్లో జమచేస్తామని ఆఫీసర్లు ప్రకటించారు. ఈనెల 13న హైదరాబాద్లోని ప్రజాభవన్లో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రి శ్రీధర్బాబు మీడియా సమావేశంలో సింగరేణి లాభాల బోనస్ వివరాలను ప్రకటించారు.
ఈ ఏడాది సింగరేణి ఆర్జించిన రూ.1,754 కోట్ల నికర లాభాల్లో 34 శాతం లాభాల వాటాగా కార్మికులకు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. సంస్థలో పనిచేసే పర్మినెంట్ ఉద్యోగులతోపాటు కాంట్రాక్టు కార్మికుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. గతేడాది మాదిరిగా కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500 బోనస్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వివరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న పర్మినెంట్ కార్మికులందరి బ్యాంకు ఖాతాల్లో లాభాల బోనస్ డబ్బులు జమ చేసినట్లుగా సంబంధిత శాఖ అధికారులు ప్రకటించారు.
