హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీ మధ్య ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయరా అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఏపీకి రిలీవ్ చేస్తూ సెప్టెంబర్లో ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హనుమకొండ, గాంధీ మెడికల్ కాలేజీలో కొనసాగుతున్న ప్రొఫెసర్ రత్నం ఆండాళ్లు, డాక్టర్ శ్రీలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ కె.సుజన ధర్మాసనం శుక్రవారం పిటిషన్లపై విచారణ జరిపింది. అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని గతంలో సూచించిన ధర్మాసనం.. పూర్తి వివరాలతో కౌంటర్లు వేయాలని ఆదేశిస్తూ ఈ నెల 29కి విచారణను వాయిదా వేసింది.
