- పరువు నష్టం కలిగించే కథనాల ప్రసారంపై మధ్యంతర స్టే
- రెస్పాండెంట్లకు నోటీసులు.. విచారణ నవంబర్ 20కి వాయిదా
హైదరాబాద్, వెలుగు: ప్రముఖ వైద్య సంస్థ మెడికవర్ హాస్పిటల్స్ ప్రతిష్టను దెబ్బతీసేలా పరువునష్టం కలిగించే వార్తలు రాయడం, ప్రసారం చేయడంపై రాష్ట్ర హైకోర్టు మధ్యంతర నిషేధం విధించింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, వ్యక్తులు ఎవరూ కూడా హాస్పిటల్ పై అనుచిత ప్రచారం చేయరాదని జస్టిస్ ఎం.బి. ధర్మాసనం ఆదేశించింది. తమపై వస్తున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని కోరుతూ మెడికవర్ యాజమాన్యం సిటీ సివిల్ కోర్టులో దావా వేయగా.. తక్షణ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకుండా అక్టోబర్ 29కి నోటీసులు జారీ చేసింది.
దీన్ని సవాల్ చేస్తూ మెడికవర్ యాజమాన్యం హైకోర్టులో రివిజన్ పిటిషన్లు దాఖలు చేసింది. దీనిపై విచారించిన హైకోర్టు.. మీడియాలో వచ్చిన కథనాలు ప్రాథమికంగా పరువునష్టం కలిగించేలా ఉన్నాయని, ఇవి రోగుల్లో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తాయని పేర్కొంది. డిజిటల్ యుగంలో ఇలాంటి వ్యవహారాల్లో న్యాయస్థానాలు వెంటనే స్పందించాల్సి ఉండగా, కింది కోర్టు చురుగ్గా వ్యవహరించలేదని అభిప్రాయపడింది. ఈ మేరకు మీడియా సంస్థలు, ఇంటర్మీడియరీలకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను నవంబర్ 20కి వాయిదా వేసింది. రెస్పాండెంట్లు వాదనలు వినిపించేవరకు లేదా తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.
