మహిళా కబడ్డీ జట్టుకు రైల్వే మంత్రి అభినందనలు.. త్రివర్ణ పతాకం గర్వపడేలా చేశారంటూ ప్రశంసలు

మహిళా కబడ్డీ జట్టుకు  రైల్వే మంత్రి అభినందనలు.. త్రివర్ణ పతాకం గర్వపడేలా చేశారంటూ ప్రశంసలు

న్యూఢిల్లీ: జపాన్ వేదికగా జరిగిన 2026 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల కబడ్డీ జట్టు సభ్యులను శుక్రవారం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలోని రైల్ భవన్‌‌‌‌‌‌‌‌లో అభినందించారు. 

జాతీయ పతాక కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసిన క్రీడాకారిణుల ప్రతిభను, పట్టుదలను మంత్రి కొనియాడారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో ఇరాన్‌‌‌‌‌‌‌‌ను 37-–34 తేడాతో ఓడించి భారత మహిళల జట్టు తమ ఆసియా క్రీడల టైటిల్‌‌‌‌‌‌‌‌ను విజయవంతంగా కాపాడుకుంది. ఈ విజయంతో దేశానికి పేరు తెచ్చిన క్రీడాకారిణులకు రైల్వే మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. హెడ్ కోచ్ నీతా మోరేశ్వర్ దాద్వే ఆధ్వర్యంలో బరిలోకి దిగిన ఈ జట్టుకు పుష్ప రాణా కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించారు.

రైల్వే క్రీడాకారుల ఘనత

రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు ద్వారా రైల్వే శాఖ నిరంతరం క్రీడా ప్రతిభను ప్రోత్సహిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లు, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలతో పాటు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదికలపై రైల్వే క్రీడాకారులు భారత్‌‌‌‌‌‌‌‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. 

ఉద్యోగంతో పాటు క్రీడా రంగానికి తగిన ప్రోత్సాహం అందిస్తూ దేశంలో నూతన ప్రతిభను వెలికితీసేందుకు రైల్వే శాఖ నిరంతరం కృషి చేస్తోందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 
మంత్రిని కలిసిన రైల్వే క్రీడాకారిణులలో సౌత్ సెంట్రల్ రైల్వేకు చెందిన హెడ్ కోచ్ నీతా మోరేశ్వర్ దాద్వే, క్రీడాకారిణులు రీతు నేగి, పింకీ రాయ్; నార్తర్న్ రైల్వేకు చెందిన పూజ, వెస్ట్రన్ రైల్వేకు చెందిన సోనాలీ విష్ణు శింగటే, రాజ్ రాణి ఉన్నారు.