- బూడిదను టాయిలెట్లో పోసిన వైనం
- సోషల్ మీడియాలో విమర్శలు
తిరువనంతపురం: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా కేరళలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన వివాదాస్పదంగా మారింది. జ్ఞానేశ్ దిష్టిబొమ్మకు అంత్యక్రియలు చేసిన కాంగ్రెస్ శ్రేణులు.. ఆ బూడిదను టాయిలెట్లో పోశారు. శుక్రలవారం ఉదయం పాలక్కాడ్ పట్టణంలోని జిల్లా(పాలక్కాడ్) కాంగ్రెస్ కమిటీ కార్యాలయం నుంచి బస్ స్టాండ్ వరకు జ్ఞానేశ్ కుమార్ ఫొటోతో కూడిన దిష్టిబొమ్మను కార్యకర్తలు పాడెపైపెట్టి శవయాత్ర నిర్వహించారు.
హిందూ సాంప్రదాయ పద్ధతుల ప్రకారం దానికి పూల దండలు వేసి, చితికి నిప్పు పెట్టి అంత్యక్రియలు చేశారు. దిష్టిబొమ్మ పూర్తిగా దహనమైన తర్వాత నిరసనకారులు ఆ బూడిదను సేకరించి అక్కడి పబ్లిక్ టాయిలెట్ కమోడ్లో పోసి ఫ్లష్ చేశారు. ఈ వినూత్న నిరసనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒక స్వయంప్రతిపత్త రాజ్యాంగబద్ధ సంస్థ అధిపతిపై ఇలాంటి దిగజారుడు ఆందోళనలు చేయడం ఏమిటని రాజకీయ విశ్లేషకులు, పలువురు ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని.. కానీ ఇలా దహన సంస్కారాల పేరుతో టాయిలెట్లలో బూడిద పోయడం వంటి సభ్యత లేని చర్యలు రాజకీయ విలువలను దిగజార్చుతాయని మండిపడ్డారు.
గతంలో పాలక్కాడ్లోని ప్రభుత్వ విక్టోరియా కళాశాల ప్రిన్సిపాల్కు వ్యతిరేకంగా అంత్యక్రియలు నిర్వహించినందుకు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ)ను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలే ఇలా చేయండం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సర్ ప్రక్రియలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేరళలో కాంగ్రెస్ శ్రేణులు వినూత్న నిరసన చేపట్టాయి.
