- 6 నుంచి 10వ తరగతి చదివే వారికి అవకాశం
హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో చదివే పిల్లల్లో కొత్త ఆలోచనలను వెలికితీసేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు నుంచి పదో తరగతి చదివే విద్యార్థుల కోసం తెలంగాణ ఫ్యూచర్ ఇన్నోవేటర్స్ చాలెంజ్ (టీఎఫ్ఐసీ 1.0) పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. సమాజంలో తాము చూసే సమస్యలకు పరిష్కారం చూపేలా పిల్లలు వినూత్న ఐడియాలను పంపాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ కోరారు.
ఈ మేరకు డీఈఓలకు గైడ్ లైన్స్ పంపించారు. సర్కారు, లోకల్ బాడీ, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, సొసైటీ గురుకులాలు, అర్బన్ రెసిడెన్షియల్ బడుల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ఛాలెంజ్లో పాల్గొనవచ్చు. విద్యార్థులు ఒక్కరిగా లేదా ముగ్గురు కలిసి టీమ్గా ఐడియాలు ఇవ్వొచ్చు. ఆసక్తి గలవారు ఈ నెల15 నుంచి నవంబర్ 6 వరకు telangana.codemitra.org వెబ్సైట్లో తమ ఆలోచనలను నమోదు చేయాలి. విద్యార్థులు తమ ‘పెన్’ నంబర్తో లాగిన్ అయ్యి.. సమస్య ఏంటి? దానికి తాము చూపే పరిష్కారం ఏంటి? అనే వివరాలు సమర్పించాలి. ప్రాజెక్ట్ ఫొటో లేదా వీడియో కూడా అప్లోడ్ చేయొచ్చు.
విద్యార్థులు పంపిన ఐడియాలను రాష్ట్రస్థాయి కమిటీ పరిశీలించి, ప్రతి జిల్లా నుంచి 30 ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేస్తుంది. వీటితో ఆయా జిల్లాల్లో డీఈవోల ఆధ్వర్యంలో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. అక్కడ పరిశీలించి జిల్లాకు టాప్-3 ప్రాజెక్టులను ఎంపిక చేసి అవార్డులు ఇస్తారు. జిల్లాలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన ప్రాజెక్టులకు నిపుణులతో ప్రత్యేక మెంటరింగ్ ఇప్పిస్తారు. ఆ తర్వాత హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి ప్రదర్శనలో వీటిని ప్రదర్శిస్తారు. అక్కడ ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు, గైడ్ టీచర్లకు అవార్డులు ఇచ్చి సత్కరించనున్నారు.
