- ఫిజియోథెరపీ క్లినిక్‌ను నడుపుకునేందుకు లంచం అడిగిన హెచ్‌ఈఈవో శ్రీనివాసులు
హైదరాబాద్, వెలుగు: ఫిజియోథెరపీ క్లినిక్ నిర్వాహకుడి నుంచి లంచం డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లామెడికల్, హెల్త్ డిపార్ట్మెంట్ కార్యాలయం (డీఎంహెచ్‌వో) హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (హెచ్‌ఈఈఓ) కే. శ్రీనివాసులును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఓ ఫిజియోథెరపీ క్లినిక్‌ను యథావిధిగా నడుపుకునేందుకు అనుమతించే క్రమంలో శ్రీనివాసులు ఇతర నిందితులతో కలిసి బాధితుడి వద్ద లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, ఈ నెల 8న శ్రీనివాసులును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు. అనంతరం హైదరాబాద్ లోని ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఫర్ స్పీ అండ్ ఏసీబీ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆయనకు 16 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
శ్రీనివాసులు రిమాండ్ కాలం 48 గంటలు దాటడంతో, తెలంగాణ సివిల్ సర్వీసెస్ (సీసీఏ) రూల్స్ 1991 ప్రకారం ఆయనపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. ఆయనను అదుపులోకి తీసుకున్న అక్టోబర్ 8 నుంచే వర్తించేలా డీమ్డ్ సస్పెన్షన్ విధిస్తున్నట్లు కమిషనర్ స్పష్టం చేశారు. ఆయనపై ఉన్న కేసు విచారణ పూర్తయ్యేంత వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని, ముందస్తు అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్‌ను విడిచి వెళ్లరాదని హెచ్చరించారు.
