- సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి
హైదరాబాద్, వెలుగు: యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి మహానది బొగ్గు క్షేత్రాల నుంచి బొగ్గు కేటాయించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చేందుకు యాదాద్రి విద్యుత్‌ప్లాంట్‌కు నిరంతరాయంగా బొగ్గు సరఫరా జరిగేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కీలకమైన బొగ్గు కేటాయింపులు, పెండింగ్ ప్రాజెక్టుల పరిష్కారానికి సహకరించాలని తుమ్మల విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్ లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో తుమ్మల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, రైతుల సంక్షేమం, రవాణా, విద్యుత్, విద్యా రంగాల బలోపేతం కోసం ఎనిమిది కీలక ప్రతిపాదనలు చేశారు.
సత్తుపల్లి గనిని సింగరేణికివ్వండి
సత్తుపల్లి బ్లాక్–3 బొగ్గు గనిని సింగరేణి కాలరీస్‌కు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని, దీనివల్ల ఇప్పటికే ఉన్న వసతులను వినియోగించుకుంటూ త్వరితగతిన తవ్వకాలు చేపట్టవచ్చని కిషన్‌రెడ్డిని మంత్రి తుమ్మల కోరారు. కొత్తగూడెం జిల్లాలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ వర్సిటీ అభివృద్ధికి కోల్ ఇండియా సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.100 కోట్లు కేటాయించాలన్నారు. స్పందించిన కిషన్‌రెడ్డి కోల్ ఇండియా ఎండీతో ఫోన్లో మాట్లాడారు. అలాగే రామగుండం ఎరువుల కర్మాగారంలో సాంకేతిక సమస్యలతో యూరియా సరఫరాకు ఎదురవుతున్న ఆటంకాలను వివరించి, యాసంగిలో రైతులకు ఇబ్బంది లేకుండా కేంద్రమంత్రి జె.పి.నడ్డాతో చర్చించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
అవసరాలకు అనుగుణంగా యూరియా ఇవ్వండి
తెలంగాణ అవసరాలకు తగినట్లుగా యూరియా కేటాయించాలని, సత్తుపల్లి–కొవ్వూరు, పెనుబల్లి–కొండపల్లి కొత్త రైల్వే లైన్లతో పాటు పాండురంగాపురం–మల్కన్‌గిరి పనులను వేగవంతం చేసి గోదావరి పుష్కరాల నాటికి సారపాక వరకు రైలు సౌకర్యం కల్పించాలని కిషన్‌రెడ్డిని తుమ్మల కోరారు. ఈ మార్గాల ద్వారా వాణిజ్యం, ఉపాధి పెరుగుతాయని తెలిపారు. అలాగే కొత్తగూడెం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ అనుమతులు, సాంకేతిక నివేదికల ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే గిరిజన ప్రాంతాల్లో పర్యాటక, పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందన్నారు. తుమ్మల సమర్పించిన ఈ వినతులపై సానుకూలంగా స్పందించిన కిషన్‌రెడ్డి..సంబంధిత శాఖలతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
