- 3 నిమిషాల్లో వాహనం బయల్దేరాలి
- గరిష్టంగా 20 నిమిషాల్లో అంబులెన్స్ చేరాలి
- ఆలస్యమైతే నిమిషానికి రూ.20 చొప్పున జరిమానా
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా అంబులెన్స్ సేవల ప్రమాణాలు పెంచేందుకు కేంద్ర వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఫోన్ మోగిన 20 సెకన్లలోపే కాల్ సెంటర్ సిబ్బంది లిఫ్ట్ చేయాలని, 3 నిమిషాల్లోపే అంబులెన్స్ బయల్దేరాలని ఆదేశించింది. కాల్ వచ్చిన గరిష్టంగా 20 నిమిషాల్లోపు ఘటనా స్థలానికి చేరుకోవాలని, ఆలస్యమైతే సర్వీస్ ప్రొవైడర్లకు నిమిషానికి రూ.20 చొప్పున జరిమానా విధిస్తారు. వాహనంలో జీపీఎస్ ట్యాంపరింగ్ చేస్తే రూ.25 వేలు, డ్రైవర్ లేదా ఈఎంటీ లేకపోతే రూ.10 వేలు, మందుల కొరత లేదా అపరిశుభ్రత ఉంటే రోజుకు రూ.5 వేల చొప్పున ఫైన్ వేస్తారు.
లక్ష మందికి ఒక వెహికల్..
జనాభా ప్రాతిపదికన ప్రతి లక్ష మందికి ఒక బేసిక్ లైఫ్ సపోర్ట్ (బీఎల్ఎస్), ప్రతి 5 లక్షల మందికి ఒక అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ (ఏఎల్ఎస్), 50 వేల మందికి ఒక పేషెంట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ (పీటీవీ) ఉండాలి. మొత్తం ఫ్లీట్‌లో 95 శాతం వాహనాలు నిరంతరం అందుబాటులో ఉండాలని, ప్రతి అంబు లెన్స్ నెలకు కనీసం 28.5 రోజులు సేవలందించాలని నిబంధన విధించింది. పేషెంట్‌ను హాస్పిటల్‌కు చేర్చిన తర్వాత డాక్టర్లు గరిష్టంగా 15 నిమిషాల్లోపే అడ్మిట్ చేసుకుని, అంబులెన్స్‌ను తర్వాతి కాల్ కోసం రిలీవ్ చేయాలి. నిబంధనలు ఉల్లంఘించి రోగులను ప్రైవేట్ హాస్పిటళ్లకు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.
కొత్తగా ఈ-అంబులెన్స్‌లు..
కాలుష్యం తగ్గించేందుకు పీఎం ఈ-డ్రైవ్ కింద రూ.500 కోట్ల సబ్సిడీతో దేశవ్యాప్తంగా 3,800 ఎలక్ట్రిక్ అంబులెన్స్‌లను తీసుకురానున్నారు. 15 ఏండ్లు దాటిన పాత అంబులెన్స్‌లను స్క్రాప్ చేయాలని, సిలిండర్లలో ఎల్లప్పుడూ 90 శాతం ఆక్సిజన్ నిల్వ ఉండాలని ఆదేశించింది. ప్రతి ట్రిప్పు తర్వాత వాహనాన్ని 1 శాతం సోడియం హైపోక్లోరైట్‌తో శానిటైజ్ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. కలెక్టర్లు, సీఎంవోల నేతృత్వంలోని జిల్లా కమిటీలు వీటి పనితీరును క్రమం తప్పకుండా ఆడిట్ చేస్తాయని, ప్రజల ఫీడ్‌బ్యాక్‌లో కనీసం 90 శాతం సంతృప్తి స్కోరు ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది.
