- బిల్లును పాస్ చేయించే యోచనలో కేంద్రం
- ప్రభుత్వ వర్గాల లీకులు
న్యూఢిల్లీ: ఓవైపు ప్రతిపక్షాల ఆందోళన కొనసాగుతుండగా కేంద్రం మాత్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్ల మాటున డీలిమిటేషన్ ఆమోదింపజేసేందుకు ఈ నెలాఖరున స్పెషల్ సెషన్ నిర్వహించనుందని ప్రభుత్వ వర్గాలు మీడియాకు లీకులు ఇచ్చాయి. అక్టోబర్ 26,- 27 తేదీల్లో పార్లమెంట్ భవనంలో జరగనున్న 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నారు.
సమావేశాలు ప్రారంభమయ్యే వారం రోజుల ముందు నోటీసు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్ 17న జరిగిన బడ్జెట్ సమావేశాలలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల కోసం తీసుకొచ్చిన రాజ్యంగ సవరణ బిల్లును ప్రతిపక్ష సభ్యులు అడ్డుకున్నారు. అవసరమైన మెజారిటీ లేకపోవడంతో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం దానిని పక్కన పెట్టింది. వర్షాకాల సమావేశాల సమయంలో నీట్ పేపర్ లీక్పై నిరసనలతో ఈ బిల్లును సభలో ప్రవేశ పెట్టేందుకు కేంద్రానికి వీలుకుదరలేదు.
పార్లమెంట్లో బలాబలాలు
రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి పార్లమెంటులోని ఉభయ సభల్లో హాజరై ఓటు వేసిన సభ్యులలో మూడింట రెండు వంతుల (2/3) ప్రత్యేక మెజారిటీ అవసరం. ప్రస్తుతం 540 మంది సభ్యులున్న లోక్సభలో అధికార ఎన్డీయే కూటమికి సాధారణ మెజారిటీ ఉన్నప్పటికీ, అవసరమైన 360 సీట్ల మ్యాజిక్ ఫిగర్ లేదు. అయితే, గత సమావేశాలతో పోలిస్తే ఇప్పుడు ప్రభుత్వ బలం మెరుగైంది. టీఎంసీకి చెందిన 20 మంది ఎంపీలు, శివసేన(యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు అధికార పక్షానికి మద్దతుగా నిలిచారు.
డీఎంకేతో ఎన్డీయే సంప్రదింపులు
తమిళనాడు ఎన్నికల తదనంతర పరిణామాలతో కాంగ్రెస్ పార్టీకి, డీఎంకే పార్టీకి మధ్య విభేదాలు పొడసూపడం తెలిసిందే. దీనిని అనుకూలంగా మలుచుకుని డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు కూడగట్టేందుకు ఎన్డీయే నేతలు డీఎంకేతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. లోక్ సభలో డీఎంకే పార్టీకి 22 మంది ఎంపీలు ఉన్నారు. దీంతో ఆ పార్టీ మద్దతు తీసుకుని ఈ బిల్లుకు పార్లమెంట్లో ఆమోదముద్ర పడేలా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది.
