యాదాద్రికి బొగ్గు సరఫరా చేస్తం..సీఎం రేవంత్ ఫోన్ చేశారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

యాదాద్రికి బొగ్గు సరఫరా చేస్తం..సీఎం రేవంత్ ఫోన్ చేశారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  •     సింగరేణిని ఆగం చేసిందే బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ అని ఆరోపణ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం రాకుండా యాదాద్రి పవర్ ప్లాంట్‌‌‌‌కు కేంద్రం తరఫున పూర్తిస్థాయిలో బొగ్గు సరఫరా చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన బీజేపీ స్టేట్ఆఫీసులో పార్టీ సీనియర్ నేతలు ప్రకాశ్ రెడ్డి, బండారు విజయలక్ష్మి, చీకోటి ప్రవీణ్ కుమార్ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు.  సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పడిపోవడంతో కోల్ ఇండియా నుంచి బొగ్గు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి తనకు స్వయంగా ఫోన్ చేసి కోరారని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా తక్షణమే బొగ్గు లింకేజీ ఇవ్వాలని అధికారులను ఆదేశించానన్నారు. 

అయితే సింగరేణిని ఆగం చేసిందే గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలని ఆరోపించారు. బీఆర్ఎస్ సర్కార్ రూ.29 వేల కోట్ల బకాయిలు పెట్టిపోతే, రేవంత్ ప్రభుత్వం ఆ బాకీలను ఏకంగా రూ.60 వేల కోట్లకు పెంచి కార్మికుల శ్రమను దోచుకుంటోందని వివరించారు. అలాగే సింగరేణిలో 46 లక్షల టన్నుల బొగ్గు దొంగతనం జరగలేదని.. అది అధికారుల బుక్ అడ్జస్ట్‌‌‌‌మెంట్ తప్పిదం మాత్రమేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఓట్ల చోరీ కాదు.. దొంగలకు జనాలు ఓట్లేస్తలేరు

దేశంలో ఎక్కడా ఓట్ల చోరీ జరగలేదని.. అసలు నిజం ఏంటంటే దొంగలకు ప్రజలు ఓట్లు వేయడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శ్రీలంక తరహాలో దేశంలో అలజడి రేపి ఎన్డీయే సర్కారును కూల్చేస్తామని రాహుల్ గాంధీ దింపుడు కళ్లం ఆశలు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు అంతర్జాతీయ విద్రోహ శక్తులు ఎన్ని కుట్రలు పన్నినా మోదీ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేవని, దమ్ముంటే ప్రభుత్వాన్ని పడగొట్టాలని రాహుల్ గాంధీకి కిషన్‌‌‌‌రెడ్డి సవాల్ విసిరారు. 

1952లో నెహ్రూ కాలం నుంచి అమలవుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ(సర్)ను బీజేపీ కొత్తగా తెచ్చినట్లు రాహుల్ వక్రీకరిస్తున్నారని, ఆయనకు చరిత్రపై కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు, సర్ మంచివని.. బీజేపీ గెలిస్తే ఎన్నికల సంఘంపై దాదాగిరి చేస్తూ కోర్టులపైకి ఊరేగింపులు తీసుకెళ్లి న్యాయమూర్తులను బ్లాక్‌‌‌‌మెయిల్ చేసే దిగజారుడు రాజకీయాలకు తెరలేపారని కాంగ్రెస్ పై కిషన్‌‌‌‌రెడ్డి మండిపడ్డారు. దేశ భద్రత కోసం నిస్వార్థంగా పనిచేసే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌‌‌‌ను రాజకీయాల్లోకి లాగడం అత్యంత దుర్మార్గమన్నారు. తెలంగాణలో ప్రజా సమస్యలపై కొట్లాడే బీజేపీ నేతలను అర్ధరాత్రి ఇళ్లల్లోకి చొరబడి అరెస్టులు చేయిస్తూ.. ఢిల్లీకి పోయి సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగ పరిరక్షణ లెక్చర్లు దంచడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఫైర్ అయ్యారు.