న్యూఢిల్లీ: ‘ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్’ పేరిట తప్పుదోవ పట్టించే ఆరోగ్య ప్రకటనలు చేస్తుందని జెమిని ఎడిబుల్స్, ఈ-–కామర్స్ కంపెనీలు బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్‌లకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నోటీసులిచ్చింది.
ఈ నూనె చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుందని, ఇందులో 10,000 పార్ట్స్ పర్ మిలియన్ (పీపీఎం) కు పైగా నేచురల్ ఒరైజనాల్ ఉంటుందని ప్రచారం చేశారు. అయితే ఆహార నిబంధనల (2018) ప్రకారం వంటనూనెలపై ఇలాంటి గుండె సంబంధిత లేదా కొలెస్ట్రాల్ క్లెయిమ్‌లకు అనుమతి లేదని నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది. చట్ట ప్రకారం చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
అలాగే, జెమిని ఎడిబుల్స్ సరైన ఈ–-కామర్స్ సెంట్రల్ లైసెన్స్ లేకుండానే నేరుగా సొంత వెబ్సైట్ ద్వారా ఉత్పత్తులు అమ్ముతున్నట్లు గుర్తించింది. మరోవైపు పరిశుభ్రత, నిల్వ నిబంధనల ఉల్లంఘనలపై డీఎన్వీ ఫుడ్ ప్రొడక్ట్స్ లైసెన్స్‌ను సస్పెండ్ చేసింది.
