గోల్డ్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు ఆపేసిన మ్యూచువల్ ఫండ్స్.. బంగారం రేట్లు పడిపోతాయా?

గోల్డ్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు ఆపేసిన మ్యూచువల్ ఫండ్స్.. బంగారం రేట్లు పడిపోతాయా?

పండుగ సీజన్‌లో గోల్డ్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలని భావించే ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చే వార్త. రూపాయి విలువను స్థిరీకరించే ప్రయత్నాల్లో భాగంగా.. దేశంలోని కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు గోల్డ్ ఫండ్-ఆఫ్-ఫండ్స్‌లో(FOFs) కొత్త పెట్టుబడులను తాత్కాలికంగా నిలిపివేశాయి. టాటా మ్యూచువల్ ఫండ్, డీఎస్పీ మ్యూచువల్ ఫండ్ వంటి సంస్థలు అక్టోబర్ 16 నుంచి కొత్త SIP రిజిస్ట్రేషన్లు, లంప్‌సమ్ పెట్టుబడులు, స్విచ్-ఇన్ లావాదేవీలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించాయి. అయితే గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్(ETFs) లో పెట్టుబడులు పెట్టడానికి ఎలాంటి నిబంధనలు ప్రస్తుతానికి లేవు.

మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం దేశ కరెన్సీ రూపాయి విలువ బలపడటమే. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి భారీగా ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి. సెప్టెంబర్ 2025 నాటికి రూ.90వేల 136 కోట్లుగా ఉన్న గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తులు.. సెప్టెంబర్ 2026 నాటికి రూ. లక్షా 86 వేల కోట్లకు పైగా పెరిగాయి. ఈ విపరీతమైన పెట్టుబడుల ప్రవాహం పరోక్షంగా బంగారం దిగుమతులను పెంచుతోంది.

భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా గోల్డ్ వినియోగించే దేశాల్లో ఒకటి. 2025లో దేశంలో బంగారం డిమాండ్ 710.9 టన్నులుగా నమోదైంది. మనం వినియోగించే బంగారంలో ఎక్కువ భాగం విదేశాల నుంచే దిగుమతి అవుతుంది. ఆథరైజ్డ్ డీలర్లు అంతర్జాతీయ మార్కెట్ నుంచి డాలర్లను ఉపయోగించి బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. దీనివల్ల మన దేశ వాణిజ్య లోటు మరింత పెరుగుతుంది. ఇది డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువపై తీవ్రమైన ప్రభావం కలిగించింది.

గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్(FOFs) ద్వారా వచ్చే నిధులు నేరుగా ఆయా ఫండ్ హౌస్‌ల గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి మళ్లించబడతాయి. ఈటీఎఫ్‌లు ఫిజికల్ గోల్డ్ తో ముడిపడి ఉండటం వల్ల.. మార్కెట్లోకి వచ్చే ప్రతి అదనపు రూపాయికి అనుగుణంగా గోల్డ్ ఈటీఎఫ్‌లు మరింత బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అందుకే పండుగ సీజన్‌లో గోల్డ్ ఫండ్స్‌లోకి విపరీతంగా వస్తున్న నిధులను కట్టడి చేయడం ద్వారా బంగారం దిగుమతులను తగ్గించాలని, తద్వారా రూపాయి మారకం విలువను స్థిరీకరించాలని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతర నియంత్రణ సంస్థలు రూపాయిని రక్షించేందుకు ఇటీవలి కాలంలో పలు చర్యలు తీసుకున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల కోసం ప్రత్యేక డాలర్ విండోను తెరవడం, ఫారెక్స్ రిస్క్ రిజర్వ్‌ను ప్రకటించడం వంటి చర్యలు చేపట్టాయి. వీటి ఫలితంగా రూపాయి విలువ కొంత మెరుగైనప్పటికీ, పండుగ సీజన్‌లో బంగారంపై పెరుగుతున్న మోజును తగ్గించడం ద్వారా డాలర్ల డిమాండ్ భారాన్ని తగ్గించేందుకే ఈ ప్రయత్నం అంటున్నాయి ఫండ్ హౌసెస్. కావాలనుకుంటే ఇన్వెస్టర్లు తమ డీమ్యాట్ ఖాతా ద్వారా గోల్డ్ ఈటీఎఫ్‌లను, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీప్ట్‌లను కొనుక్కునేందుకు వీలు అందుబాటులోనే ఉంది. సో రూపాయి విలువను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నం వల్ల బంగారం పతనం ఊహాగానాలకు ఎలాంటి సంబంధం లేదని నిపుణులు చెబుతున్నారు.