ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మకంలోకి ఏథర్ ఎనర్జీ.. IRDAI లైసెన్స్

ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మకంలోకి ఏథర్ ఎనర్జీ..  IRDAI లైసెన్స్

ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థ 'ఏథర్ ఎనర్జీ'తన వ్యాపారాన్ని మరింత విస్తరించే దిశగా కీలక అడుగు వేసింది. ఏథర్ ఎనర్జీ అనుబంధ సంస్థ 'ఏథర్ ఇన్సూరెన్స్' కంపెనీకి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ IRDAI నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. వినియోగదారులకు ఇన్సూరెన్స్ పాలసీలను అమ్మటంతో పాటు సర్వీసింగ్ సేవలు అందించేందుకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ చేసింది.

దీంతో ఏథర్ ఇన్సూరెన్స్ సంస్థ లైఫ్, జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ విభాగాల్లో కార్పొరేట్ ఏజెంట్‌గా సేవలు అందించనుంది. అయితే కంపెనీ స్వయంగా ఇన్సూరెన్స్ పాలసీలను అండర్‌రైటింగ్ (అంటే రిస్క్ భరించడం) చేయదు, కేవలం పాలసీల పంపిణీ, సర్వీసింగ్ మాత్రమే నిర్వహిస్తుంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలతో పాటు, తమకున్న విస్తృత కస్టమర్ బేస్ ద్వారా రికరింగ్ ఇన్కమ్ సంపాదించడమే లక్ష్యంగా ఏథర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలియజేసింది.

►ALSO READ | గోల్డ్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు ఆపేసిన మ్యూచువల్ ఫండ్స్.. బంగారం రేట్లు పడిపోతాయా?

ఆర్థికంగా బలపడేందుకు ఏథర్ చేస్తున్న ప్రయత్నాలకు ఇది మంచి ఊపునిస్తుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. గడచిన FY25 ఆర్థిక సంవత్సరంలో ఏథర్ రూ. 2వేల 255 కోట్ల ఆపరేటింగ్ రెవెన్యూను నమోదు చేయగా.. నాన్-వెహికల్ సేల్స్ మొత్తం ఆదాయంలో 12 శాతంగా ఉన్నాయి. సెప్టెంబర్ నెల వాహన్ డేటా ప్రకారం.. భారత్ ఈవీ మార్కెట్‌లో ఏథర్ 14.71 శాతం మార్కెట్ వాటాతో 3వ స్థానంలో కొనసాగుతోంది. తాజాగా ఇన్సూరెన్స్ రంగంలోకి ప్రవేశించడం ద్వారా కంపెనీ ఆదాయ మార్గాలు మరింత పెరగనున్నాయి.

ఈవీ రంగంలో దూసుకుపోతున్న ఏథర్.. ఇప్పుడు ఇన్సూరెన్స్ రంగంలోకి అడుగుపెట్టడం ద్వారా తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తోంది. రాబోయే రోజుల్లో ఏథర్ కస్టమర్లకు ఒకే చోట ఈవీ బైక్,ఇన్సూరెన్స్ సేవలు లభించనున్నాయి.