- తొలి దశలో రోజుకు 100 ఎంఎల్డీలు అందుబాటులోకి...
హైదరాబాద్ సిటీ, వెలుగు : నిర్మాణ రంగం, పరిశ్రమలు, పార్కులు, పచ్చదనం పెంపు పనులకు శుద్ధి చేసిన మురుగునీటినే వాడేలా వాటర్బోర్డ్ప్లాన్అమలు చేయబోతున్నది. శుక్రవారం క్రెడాయ్, నారెడ్కో, టీబీఎఫ్ ప్రతినిధులతో జలమండలి ఎండీ అశోక్రెడ్డి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నవంబర్ 1 నుంచి ‘డయల్ -ఏ- గ్రీన్ ట్యాంకర్’ విధానాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
శుద్ధి చేసిన నీటిని ట్యాంకర్ల ద్వారా అవసరమైన వారికి అందిస్తామన్నారు. తొలి దశలో రోజుకు 100 ఎంఎల్డీ శుద్ధి చేసిన నీటిని వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించామన్నారు. నగరంలోని అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల పరిధిలోని ప్రైవేటు మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో మిగులుగా ఉన్న నీటిని కూడా వినియోగంలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇప్పటికే 51 ప్రైవేటు శుద్ధి కేంద్రాలు నమోదు కాగా, వాటి నుంచి రోజుకు సుమారు 1.5 ఎంఎల్డీ మిగులు నీరు అందుబాటులో ఉన్నట్టు గుర్తించామని, సాధ్యమైన చోట శుద్ధి కేంద్రాల నుంచి నేరుగా పైప్లైన్లు వేసి రఫరా చేయాలని భావిస్తున్నామన్నారు.
