- జహీరాబాద్‌లో త్వరలోనే రూ.8,528 కోట్ల ఆర్ అండ్ డీ సెంటర్‌కు శంకుస్థాపన
- పెండింగ్ అనుమతులు వేగవంతం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం
- రేవంత్‌తో భేటీ అయిన హ్యుండాయ్ ఇండియా
- ఎండీ చాంగ్యెన్ చో బృందం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పూర్తిస్థాయి కార్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ‘హ్యుండాయ్ మోటార్స్’ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఆటోమొబైల్ తయారీ రంగానికి హైదరాబాద్ అత్యంత అనుకూలమైన ప్రాంతమని, ఇక్కడ ప్లాంట్ నెలకొల్పితే ప్రభుత్వం తరఫున అన్ని విధాలా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. హ్యుండాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ (హెచ్ఎంఐఈ) మేనేజింగ్ డైరెక్టర్ చాంగ్యెన్ చో నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం శుక్రవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో బోధి పెవిలియన్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయింది.
ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్జ్‌లో సంస్థ ఏర్పాటు చేయనున్న ‘ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డీ)’ సెంటర్ పురోగతిపై చర్చించారు. రానున్న కొద్ది నెలల్లోనే ఈ ప్రాజెక్టు పనుల శంకుస్థాపనకు సిద్ధంగా ఉన్నట్టు సీఎంకు హ్యుండాయ్ ప్రతినిధులు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ ఆర్ అండ్ డీ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ అనుమతులన్నింటినీ వెంటనే క్లియర్ చేయాలని, పనులు వేగవంతమయ్యేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న ఉన్నతాధికారులను ఆదేశించారు.
678 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ..
జహీరాబాద్ నిమ్జ్‌లో హ్యుండాయ్ సంస్థ మొత్తం రూ.8,528 కోట్ల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నది. 678 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ గ్లోబల్ ఆర్ అండ్ డీ కేంద్రాన్ని దశలవారీగా అభివృద్ధి చేయనున్నారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా 4,276 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. హ్యుండాయ్ సంస్థకు హైదరాబాద్‌తో దాదాపు 20 ఏండ్ల అనుబంధం ఉందని, హైటెక్ సిటీలో ఇప్పటికే ఉన్న సెంటర్ ద్వారా అడ్వాన్స్డ్ వెహికల్ ఇంజినీరింగ్ కార్యకలాపాలు విజయవంతంగా సాగుతున్నాయని ఈ సందర్భంగా సీఎంకు కంపెనీ ప్రతినిధులు వివరించారు.
ఈ సాంకేతిక సామర్థ్యాన్ని మరింతగా విస్తరిస్తూ జహీరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి ఆర్ అండ్ డీతో పాటు అత్యాధునిక ‘మెగా టెస్ట్ సెంటర్’ను నిర్మించనున్నట్టు తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా సరికొత్త వాహనాల ఇంజినీరింగ్ ప్రక్రియల రూపకల్పన, క్షేత్రస్థాయి పరిశోధనలు, వాహనాల క్వాలిటీ టెస్టింగ్, వాటి నిర్ధారణ (వ్యాలిడేషన్)లాంటి అత్యంత కీలకమైన సాంకేతిక ప్రక్రియలన్నీ ఈ జహీరాబాద్ సెంటర్ కేంద్రంగానే జరగనున్నాయని సీఎంకు వివరించారు.
తెలంగాణ గ్లోబల్ సమిట్‌కు ఆహ్వానం..
గతంలో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో భాగంగా సీఎం నేతృత్వంలోని బృందం హ్యుండాయ్ ఉన్నతాధికారులతో జరిపిన చర్చల ఫలితంగానే ఈ పెట్టుబడులు కార్యరూపం దాల్చాయి. అనంతరం పరిశ్రమలు, పెట్టుబడుల ప్రోత్సాహక కేబినెట్ సబ్ కమిటీ కూడా ఈ ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేసింది. ఈ భేటీ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన వరల్డ్ క్లాస్ శాటిలైట్ నగరం ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ విజన్‌ను కూడా కంపెనీ ప్రతినిధులకు సీఎం వివరించారు. ప్రభుత్వం డిసెంబర్లో నిర్వహించబోయే ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్’కు హ్యుండాయ్ ఉన్నతాధికారులను సీఎం ఆహ్వానించారు.
దీనిపై హెచ్ఎంఐఈ ఎండీ చాంగ్యెన్ చో స్పందిస్తూ.. హైదరాబాద్‌ను గ్లోబల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రంగా మార్చాలన్న తమ లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వ ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌కు పూర్తి తగ్గట్టుగా ఉందని, తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో భాగస్వామ్యమై సంస్థను మరింత ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు, స్పెషల్ సీఎస్ కె.రామకృష్ణారావు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ పర్ఫెక్ట్ లొకేషన్..
కార్ల ఉత్పత్తి యూనిట్‌ను నెలకొల్పేందుకు తెలంగాణ అన్ని విధాలా పర్ఫెక్ట్ లొకేషన్ అని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. దేశంలోనే మధ్యస్థంగా ఉన్న భౌగోళిక అనుకూలతతోపాటు కాస్మోపాలిటన్ కల్చర్, మహిళలకు భద్రత, జీవన ప్రమాణాల్లో దేశంలోని ఇతర 6 ప్రధాన మెట్రో నగరాల కంటే హైదరాబాద్ ఎంతో మెరుగైన స్థానంలో ఉందని చెప్పారు. పారిశ్రామిక ఉత్పత్తుల రవాణాకు అనుకూలంగా రోడ్డు, రైలు, ఎయిర్ కనెక్టివిటీ వ్యవస్థలు అత్యుత్తమంగా ఉన్నాయని, భవిష్యత్తులో సముద్ర పోర్టులకు కూడా హైస్పీడ్ కనెక్టివిటీ తెచ్చే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో ఆటోమొబైల్ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రత్యేక మొబిలిటీ క్లస్టర్లను తీర్చిదిద్దుతున్నామని, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాన్ని వేగంగా పరుగులు పెట్టించేందుకు ‘పెరి- అర్బన్ రీజియన్ (ప్యూర్)’ లాంటి విధానాలను అమలు చేస్తున్నామని గుర్తుచేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అద్భుతమైన పారిశ్రామిక అనుకూలతలను సద్వినియోగం చేసుకొని, రాష్ట్రంలో కార్ల తయారీ ప్లాంట్‌ను నెలకొల్పే దిశగా కంపెనీ బోర్డులో చర్చించి ముందడుగు వేయాలని హ్యుండాయ్ యాజమాన్యానికి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
