‘కోటి ఆకాంక్షలతో తెచ్చుకున్న తెలంగాణలో బాగుపడిందెవరు?’ అనే చర్చ జరుగుతున్న టైంలో ఇటీవల కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని వందల ఎకరాల్లో ఆయన, తన కుటుంబం నిర్మించుకున్న ఫాంహౌస్‌లో పెద్ద ఎత్తున ప్రభుత్వ, అసైన్డ్ భూములను కలిపేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఇందులో నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర సర్వే చేయిస్తోంది. ఇదిలా ఉండగా కొండపోచమ్మ సాగర్ నుంచి కేసీఆర్ ఫాంహౌస్ కు వాటర్‌గ్రిడ్ తరహాలో నీళ్లను మళ్లిస్తున్న వ్యవహారం తాజాగా వెలుగు చూసింది. ఇందులో వాస్తవాలను పరిశీలించేందుకు ‘వీ6 -వెలుగు’ టీమ్ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ సందర్భంగా కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఫాంహౌస్ ఎత్తిపోతల కోసం ఏకంగా 58 ఎకరాల్లో తవ్విన పాండురంగ చెరువును చూస్తే ‘ఔరా..’ అనిపించకమానదు. పదేండ్లలో ఇరిగేషన్‌పై లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టిన కేసీఆర్ సర్కారు, రాష్ట్రంలో కొత్తగా ఒక్క ఎకరానికీ నీళ్లివ్వకున్నా తన ఫాంహౌస్‌ను మాత్రం కోటి రతనాల వీణగా మార్చుకున్నట్లు స్పష్టమవుతోంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కేసీఆర్ ఫాంహౌస్ కి దగ్గరలో కొండపోచమ్మ సాగర్ నిర్మించారు. 15 టీఎంసీల సామర్థ్యంతో ఈ రిజర్వాయర్ ని 2018 మొదలుపెట్టి 2020లో పూర్తిచేశారు. పైన ఉన్న మల్లన్నసాగర్ నుంచి నీళ్లు తీసుకోవాలని మొదట్లో డిజైన్ చేశారు. కానీ విచిత్రంగా మల్లన్నసాగర్ పూర్తికావడానికి ముందే కొండపోచమ్మ సాగర్ ను పూర్తిచేశారు. కొండపోచమ్మ సాగర్‌కు నీళ్లు మళ్లించుకునేందుకు మల్లన్నసాగర్ మధ్యంలోంచి భారీ కెనాల్ తవ్వారు. ఇందుకు పెద్దమొత్తంలో ఖర్చు చేశారు. దీనిపై అప్పట్లో ఆరోపణలు వచ్చినప్పటికీ కేసీఆరే సీఎంగా ఉండడం వల్ల ఎవరూ విచారించే పరిస్థితి లేదు. పైకి మాత్రం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ లోని ఆయకట్టుకు నీళ్లివడానికే ఈ రిజర్వాయర్ నిర్మించినట్లు చెప్పారు.
లోగుట్టు కొండపోచమ్మకే ఎరుక
కేసీఆర్ ఫాంహౌస్‌కు కనుచూపు మేరలోనే కొండపోచమ్మ సాగర్ ఉంటుంది. దాదాపు 5 కిలోమీటర్ల దూరం. ఈ రిజర్వాయర్ నుంచి మొదలయ్యే ప్రధాన కాలువను ‘జగదేవ్‌పూర్ కెనాల్’ అంటారు. మొదట్లో భవానందపూర్, శివారు వెంకటాపూర్ అనే చిన్న గ్రామాలు మాత్రమే ఉంటాయి. అవి దాటగానే నేరుగా కేసీఆర్ ఫాంహౌస్ ముందు రోడ్డుకు సమాంతరంగా ఈ కాలువ సాగిపోతుంది. ఫాంహౌస్ ముందే ఈ కాలువకు సమాంతరంగా మరో చిన్న డైవర్షన్ కెనాల్ నిర్మించారు. ఇది సరిగ్గా ఫాంహౌస్‌కు ఎదురుగా ఉండే పాండురంగ చెరువులోకి పోతుంది. కొండపోచమ్మ కాలువ నీళ్లను మళ్లించి ఈ చెరువును నింపుతున్నారు. గూగుల్ మ్యాపులో పేరు కూడా కనిపించని ఈ చెరువే కేసీఆర్ ఫాంహౌస్‌కు ప్రధాన నీటి వనరు.
ఎల్‌నినో వల్ల ఈసారి వానల్లేక అటు దేశం, ఇటు తెలంగాణల ఎటుచూస్తే అటు కరువే దరువేస్తున్నది. చూస్తుండంగనే చెరువులు, డ్యామ్‌లు, రిజర్వాయర్లు, బోర్లళ్ల నీళ్లు ఇంకిపోతున్నయ్. చాలాచోట్ల నీటి జాడలేక చేతికచ్చిన పంటలు ఎండిఎరగప్పయితన్నయ్. వచ్చే ఏడెనిమిది నెలలు జనానికి గుక్కెడు తాగునీరు ఎట్లా ఇవ్వాల్నో తెల్వక సర్కారు తలపట్టుకుంటున్నది. ఇట్లాంటి టైంల ఓ ప్రాంతం మాత్రం కళకళలాడే చెరువు, నిండుకుండలాంటి బాయి, గలగలపారే కాల్వలు, పైపులైన్లతో వందల ఎకరాల్లో పచ్చదనంతో అలరారుతోంది. అది సహజంగా జరిగితే అద్భుతమే. కానీ పదేండ్ల అధికారాన్ని అడ్డుపెట్టుకొని , వందల కోట్ల జనం సొమ్ముతో ఒక్క వ్యక్తి తన సొంతానికి చేసుకున్న ఏర్పాటు!!అదే సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్.
