కొణిజర్ల రైస్ మిల్లులో రూ.6.88 కోట్ల ధాన్యం పక్కదారి

కొణిజర్ల రైస్ మిల్లులో  రూ.6.88 కోట్ల ధాన్యం పక్కదారి

కొణిజర్ల, వెలుగు:  కొణిజర్ల మండలంలోని శ్రీనివాస రైస్ మిల్లులో రూ.6.88 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టినట్లు తేలడంతో, ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ సివిల్​ సప్లయిస్​ కార్పొరేషన్​ ఖమ్మం జిల్లా మేనేజర్ ఎం. మల్లికార్జునబాబు కొణిజర్ల పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు చేశారు. 2024-–25 రబీ, 2025-–26 ఖరీఫ్, రబీ సీజన్లలో కనీస మద్దతు ధర పథకం కింద సేకరించిన ధాన్యానికి సంబంధించి కస్టమ్ మిల్లింగ్ బియ్యం ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. కాగా, యజమాని వాటిని అప్పగించడంలో విఫలమయ్యారు. 

దీంతో ఆగస్టు 22న వరంగల్​ విజిలెన్స్, అండ్​ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు, ఖమ్మం పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్, కార్పొరేషన్​ సాంకేతిక సహాయకుడు జరిపిన తనిఖీల్లో మొత్తం 1,803.426 మెట్రిక్‌‌‌‌‌‌‌‌ టన్నుల ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించి జరిమానాతో కలిపి దీని విలువ రూ.6,88,51,886గా లెక్కించారు. ఈ వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోసం మిల్లు యజమాని సెప్టెంబర్ 15న తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు విచారణను నవంబర్ 11కి వాయిదా వేసి అప్పటివరకు బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశించడంతో ఎస్సై తదుపరి చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు.