- ఫుల్ బాటిల్‌పై రూ.30 నుంచి రూ.100 వరకు పెంపు
- ఎక్సైజ్‌శాఖ ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోకి వచ్చే ఇంపోర్టెడ్ లిక్కర్ బ్రాండ్ల ధరలను ఎక్సైజ్ శాఖ సవరించింది. స్కాచ్, సింగిల్ మాల్ట్ విస్కీలు, వోడ్కా, జిన్, టకీలా, వైన్ లాంటి అన్ని రకాల విదేశీ బ్రాండ్ల గరిష్ట రిటైల్ ధరలను (ఎంఆర్పీ) భారీగా పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలు, మద్యం దుకాణాల ద్వారా విక్రయిస్తున్న మొత్తం 352 విదేశీ బ్రాండ్ల మద్యంపై ఈ ధరల పెంపు అమల్లోకి రానున్నది. ఈ సవరణతో ఆయా బ్రాండ్ల రేట్లు సగటున 6 శాతం మేర పెరిగాయి.
కొత్తగా పెంచిన ధరలు తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సవరించిన ధరల ప్రకారం బ్రాండు, బాటిల్ పరిమాణాన్ని బట్టి ఫుల్ బాటిల్‌పై కనీసంగా రూ.30 నుంచి గరిష్టంగా రూ.100 వరకు అదనపు భారం పడనుంది. అన్ని కేటగిరీలకు ఒకే రకమైన పెంపు కాకుండా, మద్యం బ్రాండు విలువను బట్టి వేర్వేరుగా రేట్లను సవరించారు. మద్యం ధరల సవరణపై నియమించిన టెండర్ కమిటీ సమర్పించిన సిఫార్సులను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం ఈ పెంపునకు ఆమోదం తెలిపింది.
కొత్త ధరలతో కూడిన లేబుళ్లు, స్టిక్కర్లను బాటిళ్లపై తక్షణమే అతికించాలని సరఫరాదారులకు ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పటికే రాష్ట్రంలోని బెవరేజెస్ కార్పొరేషన్ డిపోల్లో నిల్వ ఉన్న విదేశీ మద్యం స్టాక్‌పై కూడా ఈ కొత్త ధరల ప్రభావం పడనున్నది. పాత స్టాక్ అయినప్పటికీ కొత్త స్టిక్కర్లతోనే విక్రయాలు సాగించాల్సి ఉంటుంది. సవరించిన కొత్త ఎంఆర్పీ ధరలకే మద్యాన్ని విక్రయించాలని ఆబ్కారీ శాఖ స్పష్టం చేసింది. అదనపు ధరలకు విక్రయించే మద్యం దుకాణాలు, బార్ల లైసెన్సులను తక్షణమే రద్దు చేయడంతోపాటు బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
బీర్లనూ మింగేయనున్న ‘ఎల్-నినో’
రాష్ట్రంలో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో తాగునీటి కొరత మొదలైంది. జలాశయాల్లో నీటి మట్టాలు రోజురోజుకూ క్షీణిస్తుండటంతో వేసవి రాకముందే నీటి తిప్పలు తలెత్తుతున్నాయి. వర్షాభావం, భూగర్భ జలాలు ఇంకిపోవడంతో ఎల్-నినో ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో... మద్యం పరిశ్రమనూ దెబ్బతీసే సంకేతాలు కనిపిస్తున్నాయి. బీర్ల ఉత్పత్తిపై ప్రభావం పడునున్నట్టు తెలుస్తున్నది.
ఒక లీటరు బీరు తయారు చేయడానికి దాదాపు 3 నుంచి 5 లీటర్ల నీరు అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో తాగు, సాగు నీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంటే, భారీగా నీటిని వినియోగించే బ్రూవరీలకు (బీర్ తయారీ యూనిట్లకు) కోతలు విధించాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిశ్రమలకు నీటి కేటాయింపులను తగ్గిస్తే రాబోయే రోజుల్లో ఉత్పత్తి నిలిచిపోయి బీర్ల కొరత ఏర్పడే తీవ్ర ముప్పు పొంచి ఉంది.
41 బార్లకు ముగిసిన లక్కీ డ్రా
రాష్ట్రవ్యాప్తంగా 41 కొత్త బార్ల లైసెన్సుల కేటాయింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. క్యూర్ పరిధిలోని 14 బార్లతోపాటు వివిధ జిల్లాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని 27 బార్లకు శుక్రవారం నిర్వహించిన ‘లక్కీ డ్రా ఆఫ్ లాట్స్’ విజయవంతమైంది. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి డిప్యూటీ కమిషనర్ల పరిధిలోని 14 బార్లకు మొత్తం 4,251 దరఖాస్తులు రాగా.. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ సి.హరికిరణ్ చేతుల మీదుగా నగరంలో డ్రా తీశారు.
మిగిలిన జిల్లాల్లోని 27 బార్లకు వచ్చిన 4,519 దరఖాస్తులకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహించి విజేతలను ఎంపిక చేశారు. మొత్తం 41 బార్లకు కలిపి ఏకంగా 8,770 దరఖాస్తులు రావడంతో పోటీ నెలకొన్నది. జిల్లాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని 27 బార్లకు సంబంధించిన లక్కీ డ్రాలను కలెక్టర్ల పర్యవేక్షణలో నిర్వహించారు.
