- 111 జీవో ప్రాంతాల నుంచి ఐటీ ఏరియాలకు సరఫరా
- ఫామ్‌హౌస్‌లలో బోర్ల నీళ్ల అమ్మకం
- 10 వేల నుంచి 20 వేల లీటర్ల ట్యాంకర్లతో బిజినెస్
- జంట జలాశయాల దగ్గరా ఆగని నీటి దందా
- రాత్రికి రాత్రి వందల ట్యాంకర్లు వెస్ట్సిటీకి...
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎల్ నినో ఎఫెక్ట్ తో నీటి అవసరాలు పెరుగుతున్నాయి. ఐటీ కంపెనీలు, హాస్టళ్లు, భారీ అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలకు ట్యాంకర్ల అవసరం పెరిగింది. ఈ డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల దందాకు తెరలేపారు. నగర శివారు ప్రాంతాల్లోని బోర్లు, ఫామ్‌హౌస్‌ల నుంచి భూగర్భ జలాలను తోడి ట్యాంకర్ల ద్వారా హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
మరోవైపు జంట జలాశయాల నుంచి కూడా నీటిని అక్రమంగా తరలిస్తున్నారు. ఒక్క హిమాయత్ సాగర్ నుంచే రాత్రికి రాత్రి వందల ట్యాంకర్ల నీళ్లను తీసుకుపోతున్నారు. హిమాయత్ సాగర్ కు ఆనుకొని కొందరు ప్రైవేటు వ్యక్తులు బోర్లను వేసి అందులోంచి నీళ్లను తోడేస్తున్నారు. రాత్రి వేళల్లో అయితే డైరెక్ట్హిమాయత్సాగర్లో నుంచే నీటిని తోడి ట్యాంకర్లలో నింపి దందా చేస్కుంటున్నారు. ఈ ట్యాంకర్లు దాదాపు ఒక్కొక్కటి 20 వేల లీటర్ల కెపాసిటీతో ఉండడంతో బోర్లతోని నింపడం సాధ్యం కాదని, డైరెక్ట్ హిమాయత్సాగర్నీటినే తోడేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
ఫామ్‌హౌస్ లలో నీళ్ల అమ్మకం
శివారు ప్రాంతాల్లోని కొన్ని ఫామ్‌హౌస్‌లు, ప్రైవేట్ స్థలాల్లో ఏర్పాటు చేసిన బోర్లు నీటి వ్యాపారానికి కేంద్రాలుగా మారుతున్నాయి. వ్యవసాయం, వ్యక్తిగత అవసరాలు లేదా ఇతర పరిమిత అవసరాల కోసం వినియోగించాల్సిన బోర్ల నుంచి భారీ స్థాయిలో నీటిని తోడి అమ్ముకుంటున్నారు. 10 వేల నుంచి 20 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకర్లతో ఈ దందా సాగుతోంది. బోర్ల నుంచి ట్యాంకర్లకు నీటిని ఇచ్చినందుకు 5వేల లీటర్లకి రూ.400 నుంచి వెయ్యి వరకు తీసుకుంటున్నారు. అసలు ప్రైవేట్ ట్యాంకర్లలో నీటిని ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు? బోర్ల నుంచి నీటిని తోడేందుకు అవసరమైన అనుమతులున్నాయా? అనే ప్రశ్నలకు సమాధానాలే లేవు.
హైటెక్ సిటీ, నానక్ రాంగూడ లే టార్గెట్
ఐటీ సంస్థలు, హాస్టళ్లు ఎక్కువగా ఉండే హైటెక్ సిటీ, మాదాపూర్, నానక్ రాంగూడ, గచ్చిబౌలి ప్రాంతాలే టార్గెట్ గా ప్రైవేట్ ట్యాంకర్ల దందా నడుస్తోంది. వీటితో పాటు గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లలో కూడా ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. 5 వేల లీటర్ల కెపాసిటీ ఉన్న ట్యాంకర్ల నుంచి 20 వేల లీటర్ల ట్యాంకర్లతో బిజినెస్ కొనసాగుతోంది. డిమాండ్ ని బట్టి 5వేల లీటర్ల ట్యాంకర్ ని రూ.2500, 20వేల లీటర్ల ట్యాంకర్లను రూ.10వేల నుంచి రూ.12వేల వరకు అమ్ముతున్నారు. హైటెక్ సిటీ, నానక్ రాంగూడ ప్రాంతాల్లోని ఐటీ కంపెనీలు, హాస్టల్స్, ఇతర వాటికి సప్లై అవుతున్న వాటిలో సగం వరకు ట్యాకర్లు 111 జీవో, జంట జలాశయాల పరిధిలోని గ్రామాల నుంచే వెళుతున్నట్లు తెలుస్తోంది. ఇదంతా రాత్రి 11 నుంచి ఉదయం 7 గంటల్లోపే జరుగుతోంది.
ఎస్టీపీలు ఎక్కడ?
సిటీలో ఐటీ కంపెనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఎస్టీపీలు ఉన్నాయా లేవా? ఒకవేళ ఉంటే వాటిని రన్ చేస్తున్నారా?లేదా అనే అంశాలను అధికారులు పట్టించుకోవడం లేదు. చాలాచోట్ల కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందని ఎస్టీపీలను రన్ చేయడం లేదని తెలిసింది. దీంతో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. ఎస్టీపీలు రన్ లో ఉంటే కొంతమేర వాటర్‌ట్యాంకర్లకు డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది.
