అభిజీత్‌‌ దీప్కే అరెస్ట్‌‌.. ‘లెహ్రా దో తిరంగా’ యాత్రకు ఢిల్లీ పోలీసుల బ్రేక్ 

అభిజీత్‌‌ దీప్కే అరెస్ట్‌‌.. ‘లెహ్రా దో తిరంగా’ యాత్రకు ఢిల్లీ పోలీసుల బ్రేక్ 
  •  
  •     ర్యాలీకి సిద్ధమవుతుండగా అదుపులోకి.. నేహా బోరాతో పాటు కార్యకర్తలు కూడా..
  •     కన్నాట్ ప్లేస్ పరిసరాల్లో బీఎన్‌‌ఎస్ సెక్షన్ 163
  •     నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
  •  


 

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జాతీయ జెండా ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను  ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ‘లెహ్రా దో తిరంగా’ పేరుతో తలపెట్టిన మార్చ్ ప్రారంభం కావడానికి కొద్ది నిమిషాల ముందే పోలీసులు ఆయన ఇంటికి చేరుకొని నోటీసులు అందజేశారు. వారం రోజుల వ్యవధిలోనే దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. మరోవైపు జంతర్ మంతర్ సమీపంలో నిరసనలకు యత్నించిన సీజేపీ యువజన విభాగం విద్యార్థి నేత నేహా బోరాతోపాటు పలువురు ప్రముఖ కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడినుంచి తరలించారు.

పోలీసులు, దీప్కే మధ్య తీవ్ర వాగ్వాదం

అభిజీత్ దీప్కే ఇంట్లోకి ప్రవేశించిన పోలీసు అధికారులు, ఆయన ఢిల్లీ పరిధిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నట్టు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో దీప్కే వాగ్వాదానికి దిగారు. ‘‘మీరు న్యూఢిల్లీకి వెళ్లడానికి వీల్లేదు, మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటున్నాం’’ అని అధికారులు స్పష్టం చేయగా.. ‘‘నేను ఢిల్లీకి కాకపోతే వేరే ప్రాంతానికి వెళ్లవచ్చా? అసలు నేను ఏ చట్టాన్ని ఉల్లంఘించాను? నాపై ఏం ఆరోపణలు మోపారు?’’ అని దీప్కే నిలదీశారు.  పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇష్టమొచ్చిన ఆరోపణలు చేస్తున్నారు.. కావాలంటే నన్ను ఉరి తీయండి” అంటూ మండిపడ్డారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో శాంతియుతంగానే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామని, తమ గొంతును నొక్కేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని విమర్శించారు. గాంధీ చిత్రం ముద్రించిన తెల్లటి టీషర్ట్, భుజాలపై జాతీయ జెండాను ధరించి సోఫాలో కూర్చున్న దీప్కే.. పోలీసులు ఇచ్చిన కాగితాలను పరిశీలిస్తూ అసహనం వ్యక్తం చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

అనుమతిలేని ర్యాలీ చట్టవిరుద్ధం: ఢిల్లీ పోలీస్

ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఢిల్లీ పోలీసులు బీఎన్‌‌‌‌‌‌‌‌ఎస్ సెక్షన్ 163 కింద నోటీసులు జారీ చేశారు. కన్నాట్ ప్లేస్, పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని పేర్కొన్నారు. తిరంగా యాత్రకు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ నుంచి అనుమతిలేదని, ముందస్తు అనుమతి లేకుండా జన సమీకరణ చేయడం, మార్చ్ నిర్వహించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. 

6 వేల మంది సిబ్బంది మోహరింపు 

ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌‌‌‌‌‌‌‌ సెంట్రల్ పార్క్‌‌‌‌‌‌‌‌లో సీజేపీ  ‘లెహ్రా దో తిరంగా’ ర్యాలీ నేపథ్యంలో ఆ పరిసరాల్లో హై అలర్ట్‌‌‌‌‌‌‌‌ ప్రకటించారు. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నందున నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు  హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం సుమారు 6 వేల మంది సిబ్బందితో పాటు 220 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను  భారీగా మోహరించారు. రద్దీ ప్రాంతమైన కన్నాట్ ప్లేస్, నిత్యం లక్షలాది మంది రాకపోకలు సాగించే రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ పరిసరాల్లో తొక్కిసలాట, తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడే ప్రమాదం ఉన్నందున వాహనదారులు ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని అడ్వైజరీ జారీ చేశారు. మెట్రోలాంటి  ప్రజా రవాణా సాధనాలను వాడాలని సూచించారు.  అవసరాన్ని బట్టి ట్రాఫిక్ మళ్లింపులు చేపడతామని స్పష్టం చేశారు.