హైదరాబాద్, వెలుగు: పోలీసులు యూనిఫామ్ లో డ్యాన్సులు చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు విధినిర్వాహణలో ఉండగా యూనిఫామ్లోనే డ్యాన్సులు వేయడం నిబంధనలకు విరుద్ధం అన్నారు. ఈ మేరకు ఇటీవల అంతర్గత సర్క్యులర్ జారీ చేసినట్లు తెలిసింది.
కొంతకాలం నుంచి వివిధ ఈవెంట్లలో పోలీసులు యూనిఫాంలో ఉంటూ డ్యాన్స్ చేసిన వీడియోలు నెట్టింట్లో వైరల్ కావడం.. ఆ వీడియోలపై తీవ్ర చర్చ జరగడంతో పాటు పోలీసు శాఖ క్రమశిక్షణపై విమర్శలు రావడంతో డీజీపీ ఈ మేరకు స్పందించినట్టు తెలిసింది. పోలీసు యూనిఫాం బాధ్యత, అధికారం, క్రమశిక్షణకు ప్రతీక అని.. దాని గౌరవాన్ని కాపాడాలని డీజీపీ స్పష్టం చేశారు. యూనిఫాంలో డ్యాన్సులు చేయడం, ప్రైవేట్ ఈవెంట్లలో పాల్గొనడం మానుకోవాలని, ఈ ఆదేశాలను ఉల్లంఘించే సిబ్బందిపై కఠిన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని సీవీ ఆనంద్ హెచ్చరికలు జారీ చేశారు.
