- రూ.1,230 కోట్లతో ప్రతిపాదనలు
- యాదగిరిగుట్ట, నాగార్జునకొండ, రామగిరి, హనుమాన్ హిల్, డిచ్‌పల్లిలో నిర్మాణం
- పర్యాటక రంగానికి మరింత ఊతం
- స్థానికులకు పెరగనున్న ఉపాధి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఐదు ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో అత్యాధునిక రోప్‌వేల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో సమర్పించిన ప్రతిపాదనలపై కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ స్పందించింది. ప్రతిష్టాత్మక పర్వతమాల స్కీం కింద దాదాపు రూ.1,230 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టులను చేపట్టబోతున్నది. దీంతో డీపీఆర్ ల రూపకల్పన ప్రక్రియ వేగం పుంజుకోనుంది. కొండలు, గుట్టలు, లోయల మీదుగా కేబుల్ కార్లలో సాగే ఈ ప్రయాణం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచనుంది.
కృష్ణమ్మ అలలపై.. కొండల నడుమ విహారం
ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపపు మ్యూజియం కలిగిన నాగార్జునకొండ అంతర్జాతీయ బౌద్ధ సాంస్కృతిక కేంద్రంగా విరజిల్లుతోంది. ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయంలో విజయపురి నుంచి లాంచీల ద్వారా మాత్రమే కొండపైకి వెళ్లే వీలుంది. నీటిమట్టం తగ్గినా.. ప్రతికూల వాతావరణం ఉన్నా.. రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోప్‌వే అందుబాటులోకి వస్తే కృష్ణానది అందాలు, నల్లమల అటవీ సోయగాలను ఆకాశమార్గం నుంచి వీక్షిస్తూ ప్రయాణించవచ్చు. విదేశీ బౌద్ధ పర్యాటకులు, పరిశోధకులకు ఇది అద్భుత అనుభూతిని ఇస్తుంది.
టెంపుల్ సిటీ నుంచి నారసింహుడి సన్నిధికి..
తెలంగాణకే తలమానికమైన పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. ఆలయ అభివృద్ధిలో భాగంగా కొండకు ఎదురుగా ఉన్న పెద్దగుట్టపై టెంపుల్ సిటీని కాటేజీలు, కల్యాణ మండపాలతో తీర్చిదిద్దారు.పెద్దగుట్ట నుంచి యాదగిరిగుట్ట ప్రధాన ఆలయం వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర లోయ మీదుగా రోప్‌వే ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీనిద్వారా వేలాది మంది భక్తులకు ట్రాఫిక్‌లో ఇబ్బందులు తప్పనున్నాయి. వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులకు కొండపైకి చేరుకోవడం సులభం కానున్నది.
కారడవిలో ట్రెక్కింగ్ కష్టాలకు చెక్
పెద్దపల్లి జిల్లాలోని చారిత్రాత్మక రామగిరి కోట అద్భుతమైన శిల్పకళ, పచ్చని ప్రకృతి సంపద, అరుదైన ఔషధ వృక్షాలకు నెలవు. కొండ పాదం నుంచి నేరుగా కోట శిఖరం వరకు 2.1 కిలోమీటర్ల మేర రోప్‌వేను నిర్మిస్తారు. ప్రస్తుతం కోటపైకి వెళ్లాలంటే దట్టమైన అడవిలో గంటల తరబడి రాళ్లబాటలో ట్రెక్కింగ్ చేయాల్సి వస్తోంది. రోప్‌వే పూర్తయితే కాళేశ్వరం–మంథని–రామగిరిలను కలిపి టూరిజం సర్క్యూట్‌గా ప్రమోట్
చేయనున్నారు.
నల్లగొండ పట్టణానికి కొత్త కళ
నల్లగొండ పట్టణ నడిబొడ్డున ఎత్తైన గుట్టపై వెలసిన ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం హనుమాన్ హిల్. హనుమాన్ హిల్ నుంచి సమీపంలోని మరో గుట్ట వరకు 1.2 కిలోమీటర్ల మేర ఎకో-ఫ్రెండ్లీ కేబుల్ కార్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు. ఇది పూర్తయితే నల్లగొండ జిల్లా ప్రజలకు వీకెండ్ స్పాట్‌గా, ఆహ్లాదాన్ని పంచే అర్బన్ టూరిజం కేంద్రంగా మారనుంది.
ఇందూరు ఖజురహోకు ఈజీ యాక్సెస్
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని ఖిల్లా రామాలయాన్ని అద్భుతమైన రాతి శిల్ప కళావైభవం కారణంగా తెలంగాణ ఖజురహో అని పిలుస్తారు. గుట్టపై ఉన్న ఆలయాన్ని చేరుకోవడానికి ప్రస్తుతం150కి పైగా నిటారైన రాతి మెట్లు ఎక్కాల్సి వస్తోంది. దీంతో వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోప్‌వే అందుబాటులోకి వస్తే స్వామివారి దర్శనం సులభతరమై, పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరగనుంది.
మరో రెండు చోట్ల ఇప్పటికే పనులు షురూ..
రాష్ట్రంలో ఇప్పటికే రెండు ప్రతిష్టాత్మక కోటలపై రోప్‌వే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రపంచ ప్రసిద్ధ ఏకశిలా రాతి కోట భువనగిరి ఖిల్లా, చారిత్రక ఖమ్మం ఖిల్లాపైకి రోప్‌వే నిర్మాణ ప్రక్రియ పురోగతిలో ఉంది. వీటికి తోడుగా ఇప్పుడు కొత్తగా మరో 5 ప్రాజెక్టులు తోడవుతుండటంతో రాష్ట్ర టూరిజం రూపురేఖలే పూర్తిగా మారిపోనున్నాయి.
లోకల్ యూత్‌కు ఉపాధి
రోప్‌వేలతో ఎలాంటి శబ్ద, వాయు కాలుష్యం ఉండదు. కొండ ప్రాంతాల్లో ఘాట్ రోడ్ల ప్రయాణంతో పోలిస్తే సమయం, ఇంధనం ఆదా అవుతాయి. సాహస, ఆధ్యాత్మిక పర్యాటకం ఊపందుకోవడంతో ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే టూరిస్టుల సంఖ్య పెరుగుతుంది. దీని ద్వారా రాష్ట్ర పర్యాటకశాఖకు ఆదాయం రెట్టింపవుతుంది. రోప్‌వే స్టేషన్ల పరిసరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, గైడ్లు, స్థానిక హస్తకళల వ్యాపారాలకు గిరాకీ పెరగనున్నది. దాంతో స్థానిక యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా స్వయం ఉపాధి లభించనున్నది.
