- కొనుగోలు కేంద్రాలకు రాని ధాన్యం
- క్వింటాల్‌కు రూ.3,900 వరకు
- చెల్లిస్తున్న వ్యాపారులు
- సెంటర్లలో ఇప్పటికీ కొనుగోళ్లు నిల్
- పీడీఎస్ అవసరాలకు ఏటా
- 24–26 లక్షల టన్నుల సన్నబియ్యం..
- 36–38 లక్షల టన్నులు సేకరించాల్సిందే!
హైదరాబాద్, వెలుగు:రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వానాకాలం సీజన్లో సన్నధాన్యం సేకరణ సవాల్‌గా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో మంచి ధర లభిస్తుండటంతో సన్నవడ్లను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకురావడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వ మద్దతు ధర, బోనస్ కంటే ఎక్కువ ధరకు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తుండటంతో పొలాల వద్దే అమ్మేస్తున్నారు. దీంతో అక్టోబర్ మొదటి నుంచే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకూ ఒక్క గింజ ధాన్యం రాలేదు. కొన్ని ప్రాంతాల్లో కొనుగోళ్లు ప్రారంభించినా, ధాన్యం రాకపోవడంతో సన్నధాన్యం సేకరణపై సివిల్ సప్లయ్స్ అధికారుల్లో ఆందోళన నెలకొన్నది. రాష్ట్రంలో కోటి ఐదు లక్షల రేషన్ కార్డుల పరిధిలోని సుమారు 3.20 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రతి నెలా 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నది.
ఇందుకోసం నెలకు 2.16 లక్షల టన్నులకుపైగా, ఏడాదికి దాదాపు 24 లక్షల నుంచి 26 లక్షల టన్నుల సన్నబియ్యం అవసరమవుతున్నది. మిల్లింగ్ సమయంలో సగటున 67 శాతం బియ్యం వస్తుందని లెక్కిస్తే, ఈ అవసరాలను తీర్చడానికి ఏటా 36 లక్షల నుంచి 38 లక్షల టన్నుల సన్నధాన్యాన్ని సేకరించాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ కేంద్రాలకు సన్నధాన్యం ఎంతమేరకు వస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.
క్వింటాల్‌కు రూ.3,900 వరకు ధర
ఈ సారి వానాకాలం సీజన్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా వరి సాగు విస్తీర్ణం తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 55 నుంచి 56.59 లక్షల ఎకరాల్లోనే వరి సాగైనట్టు అంచనాలున్నాయి. గతంతో పోలిస్తే సాగు విస్తీర్ణం తగ్గడంతో దిగుబడులపైనా ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో మిల్లర్లు, ప్రైవేటు వ్యాపారులు ముందుగానే ధాన్యాన్ని సేకరించేందుకు పోటీ పడుతున్నారు. ముందస్తుగా వరినాట్లు వేసిన నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో కోతలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో వ్యాపారులు కల్లాల వద్దకే వెళ్లి పచ్చి ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.3,500 నుంచి రూ.3,900 వరకు కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. మరో వారం, పది రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కోతలు ఊపందుకోనున్నాయి. దీంతో సన్నధాన్యానికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులు ప్రభుత్వ ధర కంటే ఎక్కువ చెల్లిస్తుండటంతో రైతులు తమ పంటను వారికే విక్రయిస్తున్నారు.
బోనస్ ఇస్తున్నా.. ప్రైవేటుకే అమ్మకాలు
రాష్ట్రంలో వరి ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం సాధారణ రకానికి క్వింటాల్‌కు రూ.2,441, గ్రేడ్-ఏ రకానికి రూ.2,461 కనీస మద్దతు ధర ప్రకటించింది. మరోవైపు ప్రభుత్వం గుర్తించిన 7 రకాల సన్నధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నది. దీంతో అర్హత కలిగిన సన్నధాన్యానికి మద్దతు ధర, బోనస్ కలిపి రూ.2,941 వరకు లభించే అవకాశం ఉంది. బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్ఎం 1638, డబ్ల్యూజీఎల్ 44, కేఎన్ఎం 7715 రకాల ధాన్యానికి ఈ బోనస్ వర్తిస్తున్నది. అయినప్పటికీ బహిరంగ మార్కెట్లో ధర ఎక్కువగా లభిస్తుండటంతో అన్నదాతలు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల కంటే ప్రైవేటు వ్యాపారుల కు విక్రయించేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే మద్దతు ధర, అర్హత ఉంటే బోనస్ లభిస్తుండగా.. బయటే ఎక్కువ ధర వస్తుండటంతో రైతులు ఆ దిశగా నిర్ణయం తీసుకుంటున్నారు.
పీడీఎస్‌కు సన్నబియ్యం కొరత వచ్చేనా?
ప్రభుత్వానికి సన్నధాన్యం సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులు రేషన్ బియ్యం సరఫరాపై ప్రభావం చూపే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి నెలా 3.20 కోట్ల మంది లబ్ధిదారులకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో సరిపడా నిల్వలు సమకూర్చుకోవడం కీలకంగా మారింది. ఏటా 24 లక్షల నుంచి 26 లక్షల టన్నుల సన్నబియ్యం అవసరమవుతుండగా, అందుకు తగ్గట్టుగా ముడి ధాన్యాన్ని సేకరించకపోతే ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సి ఉంటుంది. ఎల్‌నినో ప్రభావంతో పంటల దిగుబడులు తగ్గడం, బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు ఇప్పటికే 15 నుంచి 20 శాతం వరకు పెరిగినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగితే ప్రభుత్వానికి అవసరమైన సన్నబియ్యాన్ని సేకరించడం భారంగా మారవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మిల్లర్ల వద్ద మిగిలిపోయిన సన్నధాన్యాన్ని స్వాధీనం చేసుకొని, మిల్లింగ్ చేయించి ప్రభుత్వ నిల్వలకు తరలించే అంశాన్ని సర్కారు పరిశీలించినట్లు సమాచారం.
అదనపు కొనుగోళ్లతో ఆర్థిక భారం!
రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీని నిరంతరాయంగా కొనసాగించాలంటే రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన నిల్వలను ముందుగానే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కొనుగోలు కేంద్రాలకు సన్నధాన్యం తక్కువగా వస్తే మిల్లర్లు, బహిరంగ మార్కెట్ నుంచి అదనంగా సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. అదే జరిగితే పెరిగిన మార్కెట్ ధరల కారణంగా ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరిగే అవకాశముంది. అదనపు సేకరణ కోసం మరో రూ.2 వేల కోట్ల వరకు ఖర్చు కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సేకరణ వేగం పుంజుకోకపోతే పీడీఎస్ అవసరాలకు సరిపడా సన్నబియ్యం నిల్వలు ఎలా సమకూర్చుకోవాలన్నది సర్కారుకు కీలకంగా మారనుంది. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూనే, ప్రజాపంపిణీ వ్యవస్థకు అవసరమైన ధాన్యాన్ని సేకరించడం ప్రభుత్వానికి ఈ సీజన్లో పెద్ద పరీక్షగా మారింది.
65 లక్షల టన్నుల సేకరణ లక్ష్యం
వానాకాలం ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 8,224 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సివిల్ సప్లయ్స్ శాఖ ప్రణాళిక రూపొందించింది. ఈ సీజన్లో సుమారు 65 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొనుగోళ్లు, రవాణా, నిల్వలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ, రైతులు ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురాకపోవడం అధికారులకు ఇబ్బందిగా మారింది. గత వానాకాలం సీజన్లో 2025–26లో రికార్డు స్థాయిలో 71.70 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ సారి మాత్రం కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని సివిల్ సప్లయ్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం లక్ష్యంలో 40 శాతం వరకు తక్కువగా ధాన్యం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నట్టు చెబుతున్నాయి.
