- అవసరమైతే ఈ సామర్థ్యాన్ని కొన్ని లక్షలకు పెంచుకోవచ్చు
- వ్యాధుల నిర్ధారణ పరీక్షల్లో సరికొత్త టెక్నాలజీ
- హెచ్‌సీయూ, మైబయోమ్ థెరప్యూటిక్స్సంస్థ పరిశోధనకు పేటెంట్
- ప్రొఫెసర్ శ్రీనివాసులు, డాక్టర్ గౌతమ్ దాస్ ఘనత
హైదరాబాద్, వెలుగు: ఒకేసారి వేల మందికి రక్త లేదా వైరస్ పరీక్షలు చేయాల్సి వస్తే ఎంత సమయం పడుతుంది? ఎంత ఖర్చవుతుంది? రోజుల తరబడి ల్యాబ్‌ల చుట్టూ తిరగాల్సిందే కదా..! కానీ, ఇకపై అలాంటి తిప్పలు ఉండవు. అతి తక్కువ ఖర్చుతో, క్షణాల్లో వేలాది మంది డీఎన్ఏ, ఆర్ఎన్ఏ శాంపిల్స్‌ను ఒకేసారి పరీక్షించే సరికొత్త టెక్నాలజీని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ), ముంబైకి చెందిన మైబయోమ్ థెరప్యూటిక్స్ సంస్థ సంయుక్తంగా కనిపెట్టాయి. ఈ అద్భుత పరిశోధనకు భారత పేటెంట్ కార్యాలయం అధికారికంగా పేటెంట్(నంబర్ 605714) మంజూరు చేసింది.
హెచ్‌సీయూ ప్రొఫెసర్ శ్రీనివాసులు కురుకూటి, మైబయోమ్ సంస్థ సైంటిస్ట్ డాక్టర్ గౌతమ్ దాస్ కలిసి ఈ టెక్నాలజీని డెవలప్ చేశారు. కరోనా మహమ్మారి వచ్చినప్పుడు లక్షలాది మందికి ఆర్టీ-పీసీఆర్ టెస్టులు చేయడం ప్రపంచ దేశాలకు పెద్ద తలనొప్పిగా మారింది. కిట్ల కొరత, విపరీతమైన ఖర్చు, రిపోర్టులు రావడానికి రోజుల తరబడి నిరీక్షణ.. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు 2020లో సంకల్పించారు. అలా మొదలైన వీరి ఆరేళ్ల ఉమ్మడి పరిశోధన ఇప్పుడు పేటెంట్‌తో విజయవంతమైంది.
అందరి శాంపిల్స్ కలిపినా.. రిజల్ట్ తారుమారు కాదు
సాధారణంగా టెస్టులు వేగంగా చేయాలని అందరి శాంపిల్స్‌ను ఒకేసారి కలిపి పరీక్షిస్తే.. ఎవరికి పాజిటివ్ వచ్చిందో, ఎవరికి నెగెటివ్ వచ్చిందో గుర్తు పట్టడం కష్టం. కానీ, ఈ పరిశోధకులు కనిపెట్టిన పద్ధతి చాలా ప్రత్యేకం. సూపర్ మార్కెట్లోని వస్తువులపై ఉండే బార్కోడ్ మాదిరిగానే.. వీరు ప్రతీ ఒక్కరి నమూనాకు ఒక మైక్రో మాలిక్యులర్ బార్కోడ్ వేస్తారు. ఆ తర్వాత వాటన్నింటినీ ఒకేచోట చేర్చి నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ మెషీన్లలో టెస్ట్ చేస్తారు. దీంతో అందరి నమూనాలను ఒకేసారి పరీక్షించినా.. ఫలితాలు మాత్రం ఎవరివి వారికే స్పష్టంగా తెలిసిపోతాయి.
ఊళ్లకు ఊళ్లు ఒకేసారి స్క్రీనింగ్
ఈ విధానం ద్వారా ఒకే విడతలో దాదాపు 92,160 మంది శాంపిళ్లను టెస్ట్ చేయవచ్చు. అవసరమైతే ఈ సామర్థ్యాన్ని ఏకంగా కొన్ని లక్షల మందికి కూడా సులభంగా పెంచుకోవచ్చు. దీంతో వేల మందికి విడివిడిగా చేసే టెస్టుల ఖర్చుతో పోలిస్తే.. ఇందులో ఖర్చు భారీగా తగ్గుతుంది. రోజుల తరబడి ల్యాబ్‌లలో ప్రాసెస్ చేసే పని తప్పుతుంది. గంటల్లోనే రిజల్ట్స్ వస్తాయి. భవిష్యత్తులో ఏదైనా కొత్త వైరస్ లేదా అంటువ్యాధి వేగంగా వ్యాపిస్తే.. ఊళ్లకు ఊళ్లను ఒకేసారి స్క్రీనింగ్ చేసి వైరస్‌ను ఆదిలోనే కట్టడి చేయవచ్చు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల జన్యు పరిశోధనలకు కూడా ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది.
