- ఏఐపీసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన మధుయాష్కీ గౌడ్
న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏఐపీసీ) కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు కమిటీ నూతన చైర్మన్ మధుయాష్కీ గౌడ్ వెల్లడించారు. సుమారు 50 వేల మంది సభ్యులతో, అభివృద్ధి చెందిన 100 అర్బన్ జిల్లాల్లో కమిటీలను మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సూచించిన ‘బోధించు, సమీకరించు, పోరాడు’ అనే సిద్ధాంతంతో ఏఐపీసీని ముందుకు తీసుకెళ్తానని స్పష్టం చేశారు.
గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏఐపీసీ చైర్మన్గా మధుయాష్కీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ, యూపీ ఇన్చార్జ్ రాజ్పాల్ గౌతమ్, సీడబ్ల్యూసీ సభ్యులు గురుదీప్ సింగ్ సప్పాల్, రాజ్యసభ ఎంపీ దీపిందర్ హుడా, మాజీ ఎంపీ ఉదిత్ రాజ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా రూపొందించిన ఏఐపీసీ అధికారిక పాటను దీపాదాస్ మున్షీ ఆవిష్కరించారు. అలాగే, ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా వీడియో కాల్ ద్వారా మధుయాష్కీకి శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రొఫెషనల్స్ పాత్ర పెంచుతాం
దేశంలో ప్రస్తుతం మోదీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్య విలువలను మంట కలుపుతోన్న తీరుకు వ్యతిరేకంగా ప్రొఫెషనల్స్ భాగస్వామ్యం పెంచేలా పనిచేస్తామని మధు యాష్కీ అన్నారు. రాహుల్ గాంధీ విజన్కు అనుగుణంగా ప్రజాస్వామ్య విలువలను దేశంలో పెంపొందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. రాహుల్ గాంధీ కోరుకుంటున్నట్టుగా భిన్నత్వంలో ఏకత్వం కొనసాగుతూ.. దేశంలో ప్రతి పౌరుడు స్వేచ్ఛగా, గౌరవప్రదమైన జీవనం సాగించినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యమని పేర్కొన్నారు.
