కౌకూర్ చిన్నారి హత్యతో అలర్ట్.. గేటెడ్ కమ్యూనిటీల భద్రతకు.. కోర్వా కీలక సూచనలు

కౌకూర్ చిన్నారి హత్యతో అలర్ట్.. గేటెడ్ కమ్యూనిటీల భద్రతకు.. కోర్వా కీలక సూచనలు
  • భద్రతా చర్యలపై కోర్వా తనిఖీలు తప్పనిసరి  చేయాలని సూచన
  • పిల్లల రక్షణకు ప్రత్యేక గైడ్​లైన్స్​అమలుకు సలహా 
  • కౌకూర్ చిన్నారి హత్య ఘటనతో అప్రమత్తం

హైదరాబాద్ సిటీ, వెలుగు : కౌకూర్‌‌లో ఐదేళ్ల చిన్నారి హత్య ఘటనతో సిటీలోని గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌‌మెంట్లు, కాలనీల్లో అభద్రతా భావం నెలకొంది. దీంతో ఇలాంటి ఘటనలు రిపీట్​కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాన్ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ (కోర్వా) సూచించింది. నివాస సముదాయాల్లో భద్రతా లోపాలను గుర్తించి సరిదిద్దేందుకు కమిటీలు తనిఖీలు నిర్వహించాలని సూచించింది. 

వారం రోజుల్లో మీటింగులు పెట్టుకుని ఎమర్జెన్సీ ఫోన్ నంబర్లు ఉన్నాయా లేవా చూసుకోవాలని, 15 రోజుల్లో తనిఖీలు చేసి భద్రతా లోపాలు ఉన్న ప్రాంతాలను గుర్తించాలని..30 రోజుల్లో మార్పులు చేసుకోవాలని కోరారు. అలాగే, సెక్యూరిటీ గార్డులకు ట్రైనింగ్​ఇవ్వాలని, పిల్లల రక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, సీసీ కెమెరాలు పని చేస్తున్నాయా లేదా చెక్​చేసుకోవాలని, స్పెషల్​రిజిస్టర్లు నిర్వహించాలని సూచించింది.  

తాత్కాలిక పనులకు వచ్చేవారిపై నిఘా...

ఇండ్లలో పనులు చేసేందుకు తాత్కాలికంగా వచ్చే వ్యక్తులు, రిపేర్లు చేసే సిబ్బంది, మెయింటనెన్స్, డెలివరీ సిబ్బంది, కాంట్రాక్టర్ల వివరాలను ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని సూచించింది. విజిటర్స్​ఎవరైనా వస్తే వారి పూర్తి వివరాలు తీసుకోవాలని, వారు ఎవరిని కలవడానికి వస్తున్నారు? ఎన్ని గంటలకు వచ్చారు? ఎన్ని గంటలకు వెళ్లారు? అన్నది సెక్యూరిటీ గార్డులు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ విధానం ఇప్పటికే అమలులో ఉన్నా కేర్​లెస్​గా ఉంటుండడంతో అనుకోని ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అలాగే, సెక్యూరిటీ గార్డుల నియామకం, డ్యూటీల మార్పు, ట్రైనింగ్, పర్యవేక్షణపై కమిటీలు ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.  

పక్క కాలనీలతో కో ఆర్డినేషన్​ 

ఒకే ప్రాంతంలోని గేటెడ్ కమ్యూనిటీలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు కో ఆర్డినేట్​చేసుకోవాలని కోర్వా కోరింది. పక్క కాలనీల ప్రతినిధులు, సెక్యూరిటీ ఇన్​చార్జీలతో కూడిన కో ఆర్డినేషన్​కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను పరిశీలించాలని, పోలీస్ స్టేషన్లు, బీట్ పోలీసులతో ఎప్పుడూ టచ్​లో ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మాక్ డ్రిల్స్ నిర్వహించాలని పేర్కొన్నారు.

పిల్లల కోసం స్పెషల్ ​గైడ్​లైన్స్​ 

పిల్లలు ఆడుకునే ప్లేసులు పెద్దలకు కనిపించేలా ఉండాలని, అనుమతి లేని వ్యక్తులు అక్కడికి వెళ్లకుండా ఏర్పాట్లు చేసుకోవాలని, రోడ్లు, పార్కింగ్ ప్లేసులు, నిర్మాణ ప్రాంతాలు, జనసంచారంలేని చోట పిల్లల భద్రతపై తల్లిదండ్రులు, కమిటీలు శ్రద్ధ పెట్టాలని కోరారు. స్కూల్​బస్సులు, డే కేర్ సెంటర్లు, ఇతర చోట్ల నుంచి పిల్లలను తీసుకెళ్లే వ్యక్తుల గుర్తింపును నిర్ధారించే విధానం ఉండాలని సూచించింది. చిన్నారులకు వ్యక్తిగత భద్రతపై వయసుకు తగిన అవగాహన కల్పించాలని కోర్వా కోరింది.