- గాంధీ పేరును కాజేసిన సోనియా, రాహుల్, ప్రియాంక
- బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పాలన చేతగాక, రైతులను ముంచిన కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లి ఓట్ చోరీ అంటూ డ్రామాలాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు విమర్శించారు. కాంగ్రెస్ చేసింది ఓట్ చోరీ కాదని, నామ్ చోరీ అని ఎద్దేవా చేశారు. గాంధీ పేరుతో సంబంధం లేని సోనియా, రాహుల్, ప్రియాంక ఆ పేరును వాడుకుంటున్నారని ఆరోపించారు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి రాంచందర్రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ డీఆర్డీవోలో సేవలందించిన కలాం దేశ రక్షణ రంగానికి దిశానిర్దేశం చేశారని కొనియాడారు. వాజ్పేయి హయాంలో పోఖ్రాన్ అణు పరీక్షలతో దేశ సత్తా చాటారని గుర్తు చేశారు. అలాంటి కలాంను కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ సాక్షిగా ‘బాంబ్ మ్యాన్’ అంటూ హేళన చేశారని విమర్శించారు.
కేంద్రానికి ధన్యవాదాలు...
కేంద్ర కేబినెట్ ఉద్యోగులు, దివ్యాంగుల సంక్షేమానికి కీలక నిర్ణయాలు తీసుకుందని రాంచందర్రావు తెలిపారు. 11.4 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ కింద రూ.2,009.61 కోట్లు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. దివ్యాంగుల అర్హత ప్రమాణాన్ని 80 శాతం నుంచి 40 శాతానికి తగ్గించడం వల్ల ఎంతోమందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
