కేటీఆర్‌‌ ది మొసలి కన్నీరు : మంత్రి పొంగులేటి

కేటీఆర్‌‌ ది మొసలి కన్నీరు : మంత్రి పొంగులేటి
  •     సింగరేణి గనులు మూసి కార్మికుల పొట్టకొట్టింది బీఆర్‌‌ఎస్సే: మంత్రి పొంగులేటి  
  •     18 గనుల మూతకు కారణమెవరో చెప్పాలే  
  •     వరంగల్ సమావేశంలో కేటీఆర్​కు మంత్రి సవాల్​

వరంగల్‍, వెలుగు: సింగరేణి గనులు మూసేసి 40 వేల మంది కార్మికుల పొట్టకొట్టిందే బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి మండిపడ్డారు. ఇప్పుడు అదే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌ సింగరేణి పేరుతో మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. 18 గనులు మూతపడటానికి కారణమెవరో చెప్పాలని కేటీఆర్‌‌కు సవాల్‌‌ విసిరారు. గురువారం హనుమకొండలో వరంగల్‌‌, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ బీఆర్‌‌ఎస్‌‌ పదేండ్ల పాలనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో కలిసి తిరిగిందే తప్ప సింగరేణి గనులను కాపాడలేదన్నారు. గనుల వేలంలో పాల్గొనకుండా సంస్థకు అన్యాయం చేసిందని ఆరోపించారు. 

కాంగ్రెస్‌‌ అధికారంలోకి వచ్చాక వేలంలో పాల్గొని మూడు కొత్త గనులను దక్కించుకున్నామని చెప్పారు. గ్రాడ్యుయేట్‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ బలపరిచిన అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌‌రెడ్డిని గెలిపించే బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ఉమ్మడి వరంగల్‌‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 32 చోట్ల కాంగ్రెస్‌‌ ఎమ్మెల్యేలు ఉన్నారని, రెండు ఎంపీ స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులే ఉన్నారని తెలిపారు. ఈ బలం సర్వోత్తమ్‌‌రెడ్డి విజయానికి దోహదపడుతుందన్నారు. బీఆర్‌‌ఎస్‌‌, బీజేపీ కలిసి దొంగాట ఆడేందుకు సిద్ధమవుతున్నాయని ఆరోపిస్తూ, వాటిని ఎదుర్కొనేందుకు కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 

గ్రాడ్యుయేట్లు దసరా పండుగకు సొంతూళ్లకు వస్తారని, వారితో ఓటు నమోదు చేయించేలా కాంగ్రెస్‌‌ శ్రేణులు పనిచేయాలని సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌‌రెడ్డికి సూచించారు. తమ కుటుంబానికి ఉమ్మడి వరంగల్‌‌, నల్గొండ, ఖమ్మం జిల్లాలతో ఎంతో అనుబంధం ఉందని ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్‌‌రెడ్డి తెలిపారు. తన తండ్రి హనుమకొండ ఆర్ట్స్‌‌ కాలేజీ విద్యార్థిగా రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేశారు. పార్టీ కోసం, కార్యకర్తల కోసం తమ కుటుంబం 95 శాతం ఆస్తులు అమ్ముకుని పనిచేసిందని, ఎప్పుడూ పార్టీ మారలేదన్నారు. సమావేశంలో ఎంపీలు బలరాం నాయక్‌‌, చామల కిరణ్‌‌కుమార్‌‌రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌‌రెడ్డి, గండ్ర సత్యనారాయణ, యశస్వినిరెడ్డి, దొంతి మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.