తెలంగాణ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లు దాటిన విద్యుత్ డిమాండ్  

తెలంగాణ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లు దాటిన విద్యుత్ డిమాండ్  

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. అక్టోబర్‌ 15న ఉదయం 10:29 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా 20,003 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన 18,548 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌తో పోలిస్తే ఈసారి 1,455 మెగావాట్లు పెరిగింది. అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా రోజువారీ విద్యుత్‌ వినియోగం 334.54 మిలియన్‌ యూనిట్లకు చేరింది.

వ్యవసాయం, గృహాలు, పరిశ్రమల నుంచి పెరుగుతున్న డిమాండ్‌

వ్యవసాయం, గృహావసరాలు, వాణిజ్య, ఐటీ, పారిశ్రామిక రంగాల్లో విద్యుత్‌ వినియోగం పెరుగుతుండటంతో డిమాండ్‌ అధికమవుతోంది. మరోవైపు అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత కారణంగా ఏసీలు, ఇతర శీతలీకరణ పరికరాల వినియోగం పెరగడం కూడా విద్యుత్‌ అవసరాలపై ప్రభావం చూపుతోంది. భూగర్భ జలమట్టాలు తగ్గడంతో బోర్లపై ఆధారపడటం, వ్యవసాయ మోటార్ల వినియోగం పెరగడం విద్యుత్‌ డిమాండ్‌పై అదనపు ఒత్తిడిని పెంచుతున్నాయి.

TGSPDCL పరిధిలోనూ భారీ డిమాండ్‌

తెలంగాణ దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (TGSPDCL) పరిధిలో అక్టోబర్‌ 15న 12,281 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ నమోదైంది. అదే రోజు రోజువారీ విద్యుత్‌ వినియోగం 228.14 మిలియన్‌ యూనిట్లకు చేరింది. గత ఏడాది గరిష్ఠ రోజువారీ వినియోగంతో పోలిస్తే ఈసారి 5.80 మిలియన్‌ యూనిట్ల వినియోగం పెరిగింది.  సెప్టెంబర్‌ 30న TGSPDCL పరిధిలో 12,299 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌ నమోదైంది.

హైదరాబాద్‌లోనూ రికార్డు స్థాయి డిమాండ్‌

హైదరాబాద్‌ GHMC పరిధిలో అక్టోబర్‌ 15న సాయంత్రం 6:19 గంటలకు 4,220 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ నమోదైంది. అక్టోబర్‌ 9న ఈ పరిధిలో రోజువారీ విద్యుత్‌ వినియోగం 88.22 మిలియన్‌ యూనిట్లకు చేరింది. గత ఏడాది అక్టోబర్‌లో GHMC పరిధిలో నమోదైన గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ 3,552 మెగావాట్లు కాగా, ఈసారి అది గణనీయంగా పెరిగింది.

పెరుగుతున్న విద్యుత్‌ అవసరాలకు అనుగుణంగా సరఫరా వ్యవస్థను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వినియోగదారులకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు కలగకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నారు.

ఈ నేపథ్యంలో విద్యుత్‌ను అవసరమైన మేరకే వినియోగించాలని, వృథాను నివారించాలని TGSPDCL సీఎండీ జితేష్‌ వి. పాటిల్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతున్న పరిస్థితుల్లో వినియోగదారులు పొదుపు చర్యలు పాటించడం ద్వారా సరఫరా వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించేందుకు సహకరించాలని సూచించారు.