- రైతు బీమా అమలు చేయకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తాం
- కరెంట్, సాగునీరు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం
- మాజీ మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట టౌన్, వెలుగు: రైతు బీమా పథకాన్ని నిలిపివేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుమారు మూడు వేల రైతు కుటుంబాలను రోడ్డున పడేసి ఆ కుటుంబాల ఉసురు పోసుకుంటోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విమర్శించారు. సిద్దిపేటలో రైతు బీమా అందని 22 బాధిత కుటుంబాలతో గురువారం ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన మూడు వేల మంది రైతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, ఎల్ఐసీకి ప్రీమియం కట్టి రైతు బీమాను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నాయకులు కొత్త పథకం తెస్తామని బడ్జెట్ లోచెప్పారని, కానీ ఆ పథకం ఇప్పటికీ అతీగతీ లేదన్నారు. కేసీఆర్ గుంట భూమి ఉన్నా.. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి పథకం వర్తింపజేశారని, కాంగ్రెస్ చెప్పే పథకం కేవలం ఇంటి యజమానికి మాత్రమే వర్తిస్తుందని తెలిపారు.
కరెంట్, సాగునీరు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. డిమాండ్లు నెరవేర్చకపోతే సీఎం ఇల్లును ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం సిద్దిపేటలో ఎన్ హెచ్ ఎం, ఆయుష్, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల నిరవధిక సమ్మెతో పాటు స్కావెంజర్ల ఆందోళనకు ఆయన సంఘీభావం తెలిపారు.
