మెహిదీపట్నం, వెలుగు: కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగా ణలోని 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న 1200 మంది కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేయాలని చలో హైదరాబాద్ పిలుపు మేరకు గురువారం మాసబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయాన్ని ముట్టడించారు.
కృష్ణయ్య మాట్లాడుతూ.. గతేడాది ఏప్రిల్లో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు 11 రోజులు సమ్మె నిర్వహించి, వర్సిటీల్లో విద్యాబోధన స్తంభింపజేయడంతో ప్రభుత్వం దిగివచ్చి వారికి ఉద్యోగ భద్రత, రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులకు రిక్రూట్మెంట్ నిర్వహించేందుకు జీవో నంబర్ 31ని తీసుకురావడం సరైనది కాదన్నారు.
ఈ జీవోతో 1200 మంది కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం ఆ జీవోను నిలిపివేయడంతో పాటు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. వారికి ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
