ఎస్.. ఒక్క పోరాటంతో కేంద్ర మంత్రిని రాజీనామా చేయించడం తెలుసా! ఇగ కాసుకో అంటూ పిలుపునిస్తే రాజధానిని నిర్బంధంలోకి నెట్టించేలా చేయడం తెలుసా. నైతిక గెలుపు ఇంతకీ ఎవరిది? జంతర్ మంతర్ లేకుండా చేసినవాళ్లదా.. ‘జెన్ జీ’దా! యువత ఎందుకు రోడ్ల మీద పడ్డారు. అంధభక్తితో కొట్టుమిట్టాడుతున్నవారిలో చలనం రావాలనే తపన ‘జెన్ జీ’లలో ఎందుకు వచ్చింది.
హక్కులు కాలరాస్తున్నవారి కాలర్ పడితే దేశద్రోహి అయిపోతారా. నిద్ర, తిండి, ఎండ, లెక్కజెయ్యకుండా రోడ్లమీద పంచేది, దొరికేది తింటూ భావితరాలకు రాజ్యాంగం కల్పించిన రైట్ సేఫ్గా ఉండాలనే తపించినవారే జెన్ జీ అని మనం గ్రహించాలి. లింగ భేదం లేకుండా అడుగు ముందుకువేసి అన్యాయానికి ఎదురొడ్డి నిలిసిన నేహాబోరా వీడియోలు అసభ్యంగా ట్రోల్ చేసి పైశాచిక ఆనందం పొందడం నిజమైన అందభక్తికి నిదర్శనం.
తిన్నది అరక్క రోడ్లమీదకు వస్తున్నారు అని కామెంట్లు చేయడం శోచనీయం. డిగ్రీలు, పీజీలు, పీహెచ్డీలు చేసి మరీ దేశ ప్రజలకు, యువతకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నిస్తే వారిని దేశ వ్యతిరేకులుగా ఆరోపిస్తున్నారు. ఉద్యమిస్తున్న జెన్ జీ ఉద్యమకారులకు ఫండింగులు ఏడికెళ్లి వస్తున్నాయి అంటూ వాదన తెరమీదకు తెస్తున్నారు. హక్కును కాలరాస్తున్నవారి కాలర్ పట్టే ధైర్యం ఉంటే చాలు ఫండింగ్తో పనేం ఉందని పాలకులు గుర్తించాల్సిన సమయం వచ్చింది.
పాలకుల అన్యాయంపై జెన్ జీ కన్నెర్ర
చదువుకున్నవారు, సెటిల్ అయినవారు తమ దేశంకోసం, దేశయువత మేలుకోసం ఆలోచనా దృక్పథంతో ముందుకొచ్చి ఉద్యమం చేస్తే... వారిని యాంటీ నేషన్ లింక్ పెట్టి తీవ్రవాదులని ఆరోపిస్తున్నారు. ఏ ఓటుతో గద్దెనెక్కి కూర్చున్నారో అదే ఓటు ఇక నీది కాదంటే పోరాటంజెయ్యాక జెన్ జీ మౌనం వహించాలా? కేంద్ర పాలకులే దీనికి సమాధానం చెప్పాలి.
కార్పొరేట్స్కు ఇష్టం వచ్చినట్లు చట్టాలు తెచ్చి దేశరైతులను గోసపెడితే చివరికి యావత్తు దేశ రైతాంగం ఢిల్లీ బాట పట్టింది. అప్పుడు నల్ల చట్టాలు వెనక్కి తీసుకున్నారు. విద్యార్థులు అయ్యా అవ్వలు కూలి నాలి చేసి లక్షల సొమ్ము ధారబోసి చదివిస్తే వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేశారు.
ప్రభుత్వ బడుల్లో చదువుకుని నీట్లాంటి పరీక్షలకు సిద్ధమైతే పారదర్శకంగా నిర్వహించలేదు. అన్యాయాన్ని సహించక రోడ్డెక్కడం తప్పా? అధికారమే పరమావధిగా.. రాజకీయాల లబ్ధి కోసం ఇష్టానుసారంగా వ్యహరిస్తుంటే సహించడం ఎంతవరకు సమంజసమో కేంద్ర పాలకులే చెప్పాలి.
మేం మీ చెంత చేరి జపాలు చేస్తున్నవారి కోవకు వస్తే అప్పుడు భారతీయులం అయిపోతాం లేదంటే రోహింగ్యాలు, పాకిస్థానీలు అనే ముద్ర వేసి పబ్బం గడుపుకోవడం ఇక కుదరదు. ఈ హెచ్చరిక జెన్ జీ జంతర్ మంతర్ సాక్షిగా ఇప్పటికే జారీ చేసింది.
సర్కు జెన్ జీ వ్యతిరేకం కాదు
జెన్ జీలు సర్ ప్రక్రియకు వ్యతిరేకం కాదే కాదు. సర్ పేరిట ఓటు హక్కును వారి ప్రమేయం లేకుండా ఎన్నికల ఫారాలు 8 , 6 లను రాజకీయ దురుద్దేశంతో వాడడాన్నే జెన్ జీ ప్రశ్నిస్తున్నారు. నిలదీస్తున్నారు. సర్తో తొలగించిన, అడ్రెస్ గల్లంతైనవారి లెక్కలు ఈసీ బయటపెట్టాలి. ఎంతమంది రోహిగ్యాలు, పాకిస్థానీలను గుర్తించారో వెల్లడించాలి.
వారిని ఎటు డిపోర్ట్ చేశారో జెన్ జీలకు సమాధానం చెప్పాలి. అప్పడే సర్ అనేది గత ఏండ్లలో జరిగినట్టే పారదర్శకంగా జరుగుతుందని నమ్మకం కలుగుతుంది. వివరాలు మేం చెప్పం, ఓటు తీసేసి.. పోయి ఢిల్లీ ఈసీ అధికారుల వద్ద తేల్చుకోండి అంటూ చెప్పే విధానం తప్పనక ఒప్పు అంటామా! ఇంకో పెద్దాయన ‘ఓటుహక్కు కోల్పోయినవారు ఒక్కరు కూడా పోరాటం జేస్తున్న జెన్ జీలో లేరు అంటున్నాడు’.
అంటే...గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్నవారికి, హక్కులపై అవగాహన లేనివారికి అన్యాయం జరుగుతుంటే జెన్జీలు నిలదీయడం నేరమా? ఉన్మాదుల్లా బిహేవ్ చేస్తున్నారు అనేటోళ్లకు నిజమైన దేశ భక్తి ఉందో, అరాచక పాలనతో హక్కులను హరిస్తే జరిగే నష్టం తెలిసి రోడ్డెక్కినవారికి నిజమైన దేశభక్తి ఉందో ప్రజలు గ్రహించారు.
అంధభక్తిపైనే జెన్ జీ పోరాటం
దేశభక్తికి, అంధభక్తి మధ్య జరుగుతున్న పోరాటమే ఈ జెన్ జీల పోరాటం. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకోవడానికే జెన్ జీలు ఉద్యమిస్తున్నారు. పాలకులను నిలదీస్తున్నవారిని ఉక్కుపాదంతో అణచివేయాలని.. దేశ యువతను చిత్రహింసలు, లాఠీ దెబ్బలు చివరికి సోషల్ మీడియాలో రోతల పోస్టులతో కించపరచడాన్ని దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఖండించాలి.
జంతర్ మంతర్ ప్రాంతం ప్రజాస్వామ్య నిరసనలకు, ఉద్యమాలకు కేంద్ర బిందువుగా మారింది. అలాంటి జంతర్ మంతర్ వద్ద ఆంక్షలు పెట్టారు. ఇక అరెస్టులు షురూ చేశారు. జెన్ జీ పిలుపుకి భయపడి రాజధాని ఢిల్లీని నిర్బంధంలోకి నెట్టేలా చేశారు. రైళ్లు, బస్సులు ప్రధాన కూడళ్లలో పోలీసుల గస్తీతో ఎమర్జెన్సీని తలపించేలా చర్యలు తీసుకున్నారు. కేంద్ర పాలకుల నిరంకుశత్వాన్ని ఎదిరించి వారిని వణికించేలా చేసిన జెన్ జీదే నైతిక విజయం అని దేశం గుర్తించిందని పాలకులు గ్రహించాలి.
- షరీఫ్ , సీనియర్ జర్నలిస్ట్-
గమనిక: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
