- వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో ఐదుగురు చిన్నారుల మృతి ఘటన అనంతరం, ఆస్పత్రిలో వైద్య, మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం తీసుకున్న చర్యలపై సమగ్ర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు నవంబర్ 5 లోగా నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. ఆస్పత్రుల్లో తగిన వైద్య సిబ్బందిని నియమించడంతోపాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కె.అఖిల్ శ్రీగురుతేజ 2024లో పిల్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యం పెండింగ్‌లో ఉండగా, రిమ్స్‌లో చిన్నారుల మృతి ఘటన నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో తనిఖీ చేయాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలైంది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.శ్యామ్ కోశీ, జస్టిస్ సుద్దాల చలపతిరావు విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ రిమ్స్‌లో ఐదుగురు చిన్నారులు మృతి చెందారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఆస్పత్రిలో తీసుకున్న చర్యలు, వైద్య సదుపాయాల పూర్తి వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్ 5కి వాయిదా వేసింది.
