మార్కెట్ యార్డులన్నింటినీ డిజిటలైజ్ చేయాలి : మంత్రి తుమ్మల

మార్కెట్ యార్డులన్నింటినీ డిజిటలైజ్ చేయాలి : మంత్రి తుమ్మల
  •     గేట్ ఎంట్రీ నుంచి రైతుల చెల్లింపుల దాకా డిజిటల్ విధానం: మంత్రి తుమ్మల 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వాహనాల ఎంట్రీ నుంచి పంటల విక్రయాలు, తూకాలు, రైతులకు చెల్లింపుల వరకు అన్ని ప్రక్రియలను డిజిటల్ విధానంలో చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించి 15 రోజుల్లో ప్రతిపాదనలు పంపాలని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ రాహుల్ రాజ్‌‌కు సూచించారు. గురువారం సెక్రటేరియట్‌‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మార్కెట్లలో పారదర్శకత పెంచి, రైతులకు చెల్లింపులు ఆన్‌‌లైన్‌‌లోనే జరిగేలా చూడాలన్నారు. ప్రతి మార్కెట్‌‌లో సోలార్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, గోదాముల నిల్వ సామర్థ్యాన్ని 2 లక్షల టన్నులకు పెంచాలని సూచించారు. 

తక్కువ స్థలంలో ఎక్కువ పంట నిల్వ చేసేందుకు సైలోస్ విధానంలో గోదాములు నిర్మించాలన్నారు. ప్రస్తుతం 10 మార్కెట్లలో సోలార్ పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. అజీజ్‌‌నగర్‌‌లో కొత్త మార్కెట్ ఏర్పాటు చేయడంతోపాటు తూప్రాన్, గజ్వేల్, సూర్యాపేటలో నిరుపయోగంగా ఉన్న సమీకృత మార్కెట్లను తిరిగి వినియోగంలోకి తేవాలని మంత్రి ఆదేశించారు. మార్కెటింగ్ శాఖలో ఇంజనీరింగ్ అధికారుల నియామకాలను వేగవంతం చేయాలన్నారు. సీఎం రేవంత్‌‌రెడ్డి ఆదేశాల మేరకు కోహెడ్ మార్కెట్ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు మెరుగైన సేవలు అందించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.