- బెంగళూరు, హైదరాబాద్ కంపెనీలతో కాంట్రాక్టులు
న్యూఢిల్లీ: దేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాయుసేన కోసం కమ్యూనికేషన్ శాటిలైట్, నేవీ కోసం వరుణాస్త్ర టార్పెడోల కొనుగోలుకు రూ.4,106 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకుంది. స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో గురువారం ఈ కాంట్రాక్టులపై సంతకాలు చేసింది. బెంగళూరుకు చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్తో రూ.2,563 కోట్ల విలువైన జీశాట్-7సీ కమ్యూనికేషన్ శాటిలైట్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది.
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ శాటిలైట్ అందుబాటులోకి వస్తే వాయుసేన కమ్యూనికేషన్ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. దళాల మధ్య సమాచార మార్పిడికి ఇది కీలకంగా పనిచేయనుంది. అలాగే హైదరాబాద్కు చెందిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్తో రూ.1,543 కోట్ల విలువైన వరుణాస్త్ర టార్పెడోల కొనుగోలుకు మరో ఒప్పందం చేసుకుంది. నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లాబొరేటరీ అభివృద్ధి చేసిన ఈ స్వదేశీ టార్పెడోలు శత్రు జలాంతర్గాములను ఎదుర్కొనేందుకు ఉపయోగపడతాయి. వీటి ద్వారా సముద్రంలో నేవీ పోరాట సామర్థ్యం మరింత పెరగనుంది.
ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా ఈ ఒప్పందాలు కుదిరాయని రక్షణ శాఖ తెలిపింది. ఢిల్లీలో రక్షణ శాఖ అదనపు కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ (అక్విజిషన్) ఎ. అన్బరసు సమక్షంలో ఒప్పందాల ప్రక్రియ పూర్తయింది.
