- వర్చువల్‌గా ప్రారంభించిన మోదీ
న్యూఢిల్లీ: లడఖ్‌లో విమానాశ్రయ మౌలిక సదుపాయాలు, వ్యూహాత్మక రోడ్డు కనెక్టివిటీ, పునరుత్పాదక శక్తి, నీటి సంరక్షణ రంగానికి చెందిన సుమారు రూ.3,350 కోట్ల విలువైన 5 ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ గురువారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. లేహ్‌లోని కుశోక్ బకులా రిన్పోచే విమానాశ్రయంలో కొత్త ప్రయాణికుల టెర్మినల్, ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేసే 298 కి.మీ.ల పొడవైన నిమ్ము-పదుమ్-దర్శా రోడ్డు, 9 మెగావాట్ల హను జలవిద్యుత్ ప్రాజెక్టు, లేహ్‌లో భారతదేశపు తొలి పెట్రోగ్లిఫ్ కన్జర్వేషన్ పార్క్, ప్రాజెక్ట్ అమృత్ హిమ్ సరోవర్ కింద 40 గ్రామాల్లో 40 నీటి వనరుల నిర్మాణ పనులు ఇందులో ఉన్నాయి.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. 'నేడు లడఖ్‌లో పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా చాలా మందికి ప్రయాణం సులభతరమవుతుంది, కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యాలు మెరుగవుతాయి. మరికొన్ని ప్రాంతాల్లో నీటి లభ్యత పెరుగుతుంది. మన ప్రాచీన సంస్కృతి పరిరక్షణ మరింత బలపడుతుంది' అని పేర్కొన్నారు.
ప్రధానిని కలిసిన ఆసియా క్రీడల పతక విజేతలు
ఆసియా క్రీడలలో పతకాలు సాధించిన భారతీయ అథ్లెట్లను ప్రధాని మోదీ అభినందించారు. భారత్ కేవలం క్రీడా ప్రదర్శనలోనే కాకుండా, అంతర్జాతీయ ఈవెంట్లకు ఆతిథ్య దేశంగా ఎదుగుతోందని స్పష్టం చేశారు. స్వర్ణ పతకాలు గెలుచుకున్న పురుషుల, మహిళల క్రికెట్ జట్లతో పాటు పలువురు పతక విజేతలు గురువారం ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పతక విజేతలతో ఫొటోలు దిగిన ప్రధానికి.. క్రీడాకారులు సంతకం చేసిన జెర్సీలు, జ్ఞాపికలను బహుకరించారు. ఇందులో 17 ఏళ్ల రికర్వ్ ఆర్చరీ సంచలనం కుంకుమ్ మోహద్ (రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించింది) ప్రధానికి ఒక విల్లును అందించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. 'మీరు 140 కోట్ల మంది భారతీయులు గర్వపడేలా చేశారు. ఇది కేవలం మీ ఒక్కరి విజయం కాదు. కోట్లాది మంది దేశ ప్రజలది. దేశం తరఫున మీకు అభినందనలు' అని అన్నారు. అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లకు భారత్ ఆతిథ్యమివ్వగల దేశంగా మారుతోందని, 2036 ఒలింపిక్స్ కోసం బిడ్ వేస్తున్నామని, ఆ క్రీడలను ఇండియాలోనే నిర్వహించాలన్నదే తమ సంకల్పమన్నారు.
