మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు..తమిళనాడు పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు..తమిళనాడు పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: హిందూ మతం నుంచి ఇతర మతాలకు మారిన వ్యక్తులు.. కేవలం మత మార్పిడి కారణంగా గతంలో ఉన్న సామాజిక వర్గం (ఎస్సీ/బీసీ) ఆధారంగా రిజర్వేషన్ ప్రయోజనాలు పొందలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పూర్వపు సామాజిక వ్యవస్థలో అనుభవించిన వెనుకబాటుతనాన్ని మతం మారిన తర్వాతకు బదిలీ చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌‌ను జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ శ్రీచంద్రశేఖర్‌‌లతో కూడిన ధర్మాసనం గురువారం కొట్టివేసింది. 

మతం మారిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. హిందూ మతం నుంచి 2015లో ఇస్లాం మతంలోకి మారిన సమీర్ అహ్మద్.. తాను ముస్లిం లెబ్బై కమ్యూనిటీకి చెందినవాడినని ధ్రువీకరిస్తూ కుల ధ్రవీకరణ పత్రం కోరగా, అధికారులు నిరాకరించారు. దీనిపై ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. మతం మారినంత మాత్రాన ముస్లిం వెనుకబడిన తరగతుల కేటగిరీ కింద రిజర్వేషన్లు పొందలేరని స్పష్టం చేస్తూ, తమిళనాడు ప్రభుత్వం 2024 మార్చి 9న జారీ చేసిన జీఓను అసాధారణంగా ప్రకటించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, తాజాగా సుప్రీంకోర్టు ప్రభుత్వ పిటిషన్‌‌ను కొట్టివేస్తూ తుది తీర్పు వెలువరించింది.