తప్పులన్నీ చేసి.. అధికారులపై చర్యలా? : హరీశ్రావు

తప్పులన్నీ చేసి.. అధికారులపై చర్యలా? : హరీశ్రావు
  •     సీఎం, మంత్రులకు ఇది అలవాటుగా మారింది: హరీశ్​రావు
  •     విద్యుత్ రంగాన్ని గాలికొదిలేశారని ఫైర్​

హైదరాబాద్, వెలుగు: తప్పులన్నీ చేసి.. అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు అధికారులపై చర్యలు తీసుకోవడం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు అలవాటుగా మారిందని మాజీ మంత్రి, బీఆర్‌‌ఎస్‌‌ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్​రంగాన్ని గాలికొదిలేశారని ఫైర్​అయ్యారు. అధికారుల ఉద్యోగాలు తీసేస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారని.. ప్రజలు, ఉద్యోగులు కలిసి ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కనీస స్థాయిలో బొగ్గు నిల్వలు నిర్వహించలేదన్నారు. 

వేసవిలో డిమాండ్ పెరిగే అవకాశాలపై ముందస్తు ప్రణాళికలు వేయకుండా, సమీక్షా సమావేశాలు నిర్వహించకుండా నిర్లక్ష్యం ప్రదర్శించి.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 9 నెలలుగా ఎల్‌‌నినో ప్రభావం వల్ల ఎండలు, నీటి ఎద్దడి, విద్యుత్ డిమాండ్ తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ, శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. కరెంట్ కోతల విషయంలోనూ అంతా అధికారుల నిర్లక్ష్యమే అన్నట్లు ముఖ్యమంత్రి బుకాయించడం ఆయనకే చెల్లిందని ఎద్దేవా చేశారు.