- లేకపోతే సీఎం కుర్చీ నుంచి దింపడం ఖాయం
- మెదక్ ఎంపీ రఘునందన్ రావు
శివ్వంపేట/ నర్సాపూర్, వెలుగు: వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వకపోతే సీఎం రేవంత్ రెడ్డిని కుర్చీ నుంచి దింపడం ఖాయమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శంకర్ నాయక్ తండాలో పంట ఎండిపోవడంతో ఆత్మహత్య చేసుకున్న రైతు శంకర్ నాయక్ కుటుంబాన్ని ఆయన గురువారం పరామర్శించారు. ఎండిన వరిపొలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సీఎం సెక్రటేరియట్లో కూర్చొని 12 గంటలు కరెంటు ఇయ్యకుంటే ఉద్యోగాలు తీసేస్తామని బెదిరించడం సరికాదని, పాలన సరిగా చేయని ముఖ్యమంత్రి, మంత్రుల ఉద్యోగాలు తీసేయాలన్నారు. కరెంటు సరిగా రాక పంటలు ఎండిపోతున్నాయని, గ్రామాల్లోకి వచ్చి చూస్తే కరెంటు సమస్య ఎలా ఉందో తెలుస్తుందన్నారు. రైతులను విద్యుత్అధికారులు సతాయిస్తున్నారని, ప్రతి పనికీ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు.
ఆత్మహత్య చేసుకున్న రైతు శంకర్ కుటుంబానికి ప్రభుత్వం బాధత్యత వహిస్తూ రూ.50 లక్షలు పరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫుడ్ సాయిజన్బాధితులను ఎంపీ పరామర్శించారు. ఫుడ్ పాయిజన్తో మృతి చెందిన సాయిరాం కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇయ్యాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
