- గెలుపే లక్ష్యంగా ఇరుజట్లు..తుది జట్టులో భువనేశ్వర్!.
బెంగళూరు: ఇండియా, వెస్టిండీస్ మధ్య ఆఖరిదైన ఐదో టీ20కి రంగం సిద్ధమైంది. శనివారం జరిగే ఈ పోరులో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ఇరుజట్లు సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ప్రస్తుత సిరీస్‌లో చెరో రెండు విజయాలు సాధించిన ఇరుజట్లు 2–2తో సమంగా ఉన్నాయి. అయితే నిర్ణయాత్మక మ్యాచ్‌లో విండీస్‌పై ఆధిపత్యం చూపెట్టాలంటే టీమిండియా బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకోవడం తప్పనిసరి. ఓపెనింగ్‌లో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోతున్నారు.
హైదరాబాద్‌లో జరిగిన నాలుగో టీ20లో 60 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్సిప్లో శాంసన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడినా.. అభిషేక్ 2 రన్స్ మాత్రమే చేశాడు. మిడిలార్డర్లో ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నమన్ ధీర్ కీలక సమయాల్లో రాణించలేకపోవడం మైనస్‌గా మారింది. లక్నో మ్యాచ్‌లో సెంచరీ కొట్టిన శ్రేయస్ తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో నిరాశపర్చాడు. ఇది కెప్టెన్సీపై కూడా ప్రభావం చూపే చాన్స్ ఉంది. చివర్లో తిలక వర్మ, నితీష్ కుమార్ సుదీర్ఘంగా ఆడటంలో ఫెయిలవుతున్నారు. దాంతో రన్‌రేట్ ఒత్తిడిని జయించలేకపోతున్నారు.
కుల్దీప్, భువనేశ్వర్‌లో ఎవరు?
చిన్నస్వామి స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంది. బౌండ్రీ లైన్ చిన్నగా ఉండటంతో పరుగుల వరద ఖాయం కనిపిస్తోంది. అక్టోబర్ 2024 తర్వాత ఈ వేదికపై ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగకపోవడంతో పిచ్ తీరుపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో కుల్దీప్ యాదవ్‌తో పాటు స్వింగ్ కింగ్ భువనేశ్వర్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. నాలుగో టీ20లో గాయపడిన పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ప్లేస్‌లో భువనేశ్వర్‌ను జట్టులోకి తీసుకున్నారు. మిడిల్ ఓవర్లలో విండీస్‌ను కట్టడి చేయడంలో కుల్దీప్ అనుభవం బాగా ఉపయోగపడుతుంది.
బ్యాటింగ్‌పైనే దృష్టి
ఈ మ్యాచ్‌కు విండీస్ తుది జట్టులో మార్పులు చేసే చాన్స్ లేదు. స్టార్టింగ్‌లో కామిల్ పూరన్ ప్లేస్‌లో జ్యువెల్ ఆండ్రూ రావడం, గాయం తర్వాత రొమారియో షెపర్డ్‌కు చాన్స్ ఇవ్వడంతో విండీస్ ఫైనల్ ఎలెవన్ పటిష్టంగా కనిపిస్తోంది. షామెర్ జోసెఫ్ ఎకానమీ రేటు 14.17గా ఉన్నప్పటికీ ఆ జట్టులో అంతటి వేగంతో బౌలింగ్ చేసే మరో ప్రత్యామ్నాయం లేదు. కెప్టెన్ హోప్, రూథర్‌ఫోర్డ్ సూపర్ ఫామ్‌లో ఉండటం ఇండియా శిబిరంలో ఆందోళన కలిగిస్తోంది. హెట్మయర్, పావెల్ కూడా బ్యాట్లు ఝుళిపిస్తే భారీ స్కోరు ఖాయం. బౌలింగ్‌లో రోస్టన్ ఛేజ్, కీమో పాల్ కీలకం కానున్నారు.
తుది జట్లు (అంచనా)
ఇండియా: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్, శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, నమన్ ధీర్, నితీష్ కుమార్, అక్షర్ పటేల్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ / భువనేశ్వర్ కుమార్.
వెస్టిండీస్: షై హోప్ (కెప్టెన్), జ్యువెల్ ఆండ్రూ, హెట్మయర్, రొవ్మన్ పావెల్, రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, రోస్టన్ ఛేజ్, షామెర్ స్ప్రింజెర్, కీమో పాల్, షామెర్ జోసెఫ్, గుడకేశ్ మోతీ.
పిచ్, వాతావరణం
బ్యాటింగ్‌కు అనుకూలం. భారీ స్కోర్లు ఖాయం. వర్షం ముప్పు ఉంది. టాస్ కీలకం కానుంది.
98 ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు నమోదైన సిక్సర్ల సంఖ్య. ఐసీసీ ఫుల్ మెంబర్స్ మధ్య జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధికంగా కొట్టిన సిక్సర్లు 120. ఓవరాల్ రికార్డు 132గా ఉంది. 2002 నాలుగేళ్ల నుంచి ఇండియాలో ఏ ఫార్మాట్ సిరీస్‌లోనూ టీమిండియాను వెస్టిండీస్ ఓడించలేదు.
నాలుగేళ్ల తర్వాత..
ఒకప్పుడు తన స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను వణికించిన భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల తర్వాత టీమిండియా తరఫున రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. భుజం గాయం నుంచి కోలుకోవడానికి మూడు వారాల టైమ్ పట్టనుండటంతో అర్ష్‌దీప్ దాదాపుగా ఈ మ్యాచ్ ఆడే పరిస్థితి లేదు. కాబట్టి భువీ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల 22 నుంచి జరిగే కివీస్‌తో సిరీస్‌కు కూడా భువీని టీమిండియాలోకి తీసుకున్నారు. అయితే అంతకంటే ముందే విండీస్‌పై తన స్వింగ్ రుచిని చూపెట్టేందుకు భువనేశ్వర్ రెడీ అవుతున్నాడు.
2022 నవంబర్ 22న నేపియర్‌లో న్యూజిలాండ్‌తో చివరి టీ20 మ్యాచ్ ఆడిన భువీ.. 2012లో బెంగళూరులోనే పాకిస్తాన్‌పై అరంగేట్రం చేశాడు. ఇప్పుడు మళ్లీ నాలుగేళ్ల తర్వాత బెంగళూరులోనే రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. పాక్‌తో మ్యాచ్‌లో 4 ఓవర్లలో 9 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. పాక్ ఓపెనర్ నాసిర్ జంషేద్ అతని తొలి వికెట్. 2025, 2026 ఐపీఎల్ సీజన్లలో బెస్ట్ టీ20 బౌలర్‌గా నిలిచిన భువీ.. ఆర్సీబీ తరఫున 30 మ్యాచ్‌ల్లో 45 వికెట్లు తీశాడు. భువీ రీ ఎంట్రీపై టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌తో పాటు ఆర్సీబీ అసిస్టెంట్ కోచ్ ఓంకార్ సాల్వి సంతోషం వ్యక్తం చేశారు.
