వేల్స్‌తో వేట షురూ.. హాకీ వరల్డ్‌‌ కప్‌‌లో నేడు ఇండియా తొలి మ్యాచ్‌‌

వేల్స్‌తో వేట షురూ.. హాకీ వరల్డ్‌‌ కప్‌‌లో నేడు ఇండియా తొలి మ్యాచ్‌‌

అమ్‌‌స్టెల్విన్‌‌ (నెదర్లాండ్స్‌‌): భారీ ఆశలు, అంచనాల మధ్య ఇండియా హాకీ జట్టు.. ప్రతిష్టాత్మక ఎఫ్‌‌ఐహెచ్‌‌ వరల్డ్‌‌ కప్‌‌కు సిద్ధమైంది. శనివారం వేల్స్‌‌తో జరిగే తొలి పోరుతో మెగా టోర్నీని మొదలుపెట్టనుంది. 51 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి రెండోసారి వరల్డ్‌‌ కప్‌‌ను ముద్దాడాలనే పట్టుదలతో హర్మన్‌‌ప్రీత్‌‌ సింగ్‌‌ సేన బరిలోకి దిగుతోంది. 1975లో అజిత్‌‌ పాల్‌‌ సింగ్‌‌ నేతృత్వంలోని ఇండియా.. పాకిస్తాన్‌‌ను ఓడించి తొలి ప్రపంచకప్‌‌ను సాధించింది. అప్పట్నించి ఇప్పటివరకు మళ్లీ ఆ అరుదైన విజయం దక్కలేదు. 

ఇక ఈ టోర్నీలో ఇండియా ముందడుగు వేయాలంటే 15వ ర్యాంక్‌‌లో ఉన్న వేల్స్‌‌ను కట్టడి చేయాల్సిన అవసరం చాలా ఉంది. హర్మన్‌‌ప్రీత్‌‌ డ్రాగ్‌‌ ఫ్లిక్స్‌‌తో పాటు డిఫెన్స్‌‌లో ప్రధాన బలంగా కనిపిస్తున్నా.. అతని తోడుగా నిలిచే వారు కరువయ్యారు. ఈ మ్యాచ్‌‌ కోసం యువకులు, సీనియర్లతో కూడిన పటిష్టమైన జట్టును బరిలోకి దించనున్నారు. మిడ్‌‌ఫీల్డర్‌‌ మన్‌‌ప్రీత్‌‌ సింగ్‌‌, హార్దిక్‌‌ సింగ్‌‌పై ఎక్కువ ఆశలు ఉన్నాయి. ఫార్వర్డ్స్‌‌లో అభిషేక్‌‌, మన్‌‌దీప్‌‌పై భారీ అంచనాలు ఉన్నాయి. వీరందరూ సమష్టిగా రాణిస్తే ఇండియాకు తిరుగుండదు.