వరంగల్, వెలుగు: ఓరుగల్లు కేంద్రంగా ఆరు జిల్లాల ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు సరఫరా చేసిన విజయ డెయిరీ పాలు శుక్రవారం విరిగిపోయాయి. ఉదయం విద్యార్థులకు పాలు, రాగిజావ, పెరుగు, మజ్జిగ అందించే సమయంలో వంట సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు విద్యాసంస్థల్లో విద్యార్థులకు పాల ఆధారిత ఆహారం అందలేదు. హనుమకొండ ములుగురోడ్డులోని విజయ డెయిరీ నుంచి రోజూ సుమారు 10 వేల లీటర్ల పాలు సరఫరా అవుతుండగా, శుక్రవారం పెద్ద మొత్తంలో పాలు పాడైనట్లు సమాచారం.
ట్రేడర్లు, డిస్ట్రిబ్యూటర్లు అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించినా స్పందన లేకపోవడంతో డెయిరీ కేంద్రానికి చేరుకున్నారు. పాలు ఎందుకు విరిగిపోయాయనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా, గురువారం హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ విజయ డెయిరీని తనిఖీ చేసి పాల నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆఫీసర్లను ఆదేశించారు. మరుసటి రోజే పాలు పాడవడంతో డెయిరీ నిర్వహణ, నాణ్యత పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
