అమెరికా వీసా కోసం ఏడాది వెయిటింగ్.. హైదరాబాదులో ఎందుకు ఇంత లాంగ్ క్యూ?

అమెరికా వీసా కోసం ఏడాది వెయిటింగ్.. హైదరాబాదులో ఎందుకు ఇంత లాంగ్ క్యూ?

అమెరికా వెళ్లాలనుకునే భారతీయ ప్రయాణికులకు నిరాశే మిగలనుంది. వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడటంతో పాటు, వీసా ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రస్తుతం అమెరికా వీసా దక్కించుకోవడం గతంలో లేనంత కష్టంగా మారింది. అమెరికా ప్రభుత్వం తాజాగా రిలీజ్ చేసిన వీటికి సంబంధించిన డేటా అమెరికా కలలు కంటున్న వారిని షాక్ కి గురిచేస్తున్నాయి.

రికార్డు స్థాయిలో వెయిటింగ్..
ఆర్థిక సంవత్సరం 2025లో నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూ కోసం భారతీయులు సగటున ఏకంగా 346 రోజులు అంటే దాదాపు ఏడాది వేచి చూడాల్సి వచ్చినట్లు రిపోర్ట్ వెల్లడించింది. కోవిడ్-19కు ముందు ఇది కేవలం 42 రోజులుగా మాత్రమే ఉండేది. అంటే ప్రస్తుత వెయిటింగ్ పీరియడ్ దాదాపు 8 రెట్లు పెరిగిందన్నమాట. అమెరికా వీసాల కోసం విపరీతంగా పెరిగిన డిమాండ్‌కు తగినట్లుగా అక్కడి కాన్సులర్ అధికారుల సంఖ్య లేకపోవడం వల్లే ఈ తీవ్ర జాప్యం జరుగుతోంది.

సిబ్బంది కొరత - భారత్‌పై తీవ్ర ప్రభావం
కేవలం ఒక్క 2025 ఆర్థిక సంవత్సరంలోనే భారత్‌లో 14లక్షల 50వేలకు పైగా నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తులు వచ్చాయి. అయితే వీటిని పరిశీలించడానికి కేవలం 68 మంది కాన్సులర్ అధికారులు మాత్రమే ఉన్నారు. అంటే ఒక్కో అధికారికీ దాదాపు 21వేల 401 దరఖాస్తుల భారం పడింది. ప్రపంచవ్యాప్తంగా కాన్సులర్ అధికారుల సంఖ్య 1,342 నుంచి 904కు తగ్గిపోవడం, మరోవైపు వీసా అప్లికేషన్లు రికార్డు స్థాయిలో పెరగటం ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని అమెరికా వెల్లడించింది. చైనా, బ్రెజిల్‌తో పోలిస్తే భారత్, మెక్సికో దేశాలవారే అత్యధికంగా ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారట.

నగరాల వారీగా వెయిటింగ్ పిరియడ్..
ప్రస్తుతం టూరిజం మరియు వ్యాపార పర్యటనల కోసం వాడే B1/B2 వీసాల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. వివిధ భారతీయ నగరాల్లో అపాయింట్‌మెంట్‌ల పరిస్థితి ఇలా ఉంది:

* హైదరాబాద్‌లో సుమారు 12 నెలలు
* ముంబైలో 11.5 నెలలు
* న్యూ ఢిల్లీలో10 నెలలు
* చెన్నైలో 7.5 నెలలు
* కోల్‌కతాలో 6.5 నెలలు
అయితే స్టూడెంట్ వీసాలు, ఉద్యోగ వీసాల కేటగిరీలకు మాత్రం వెయిటింగ్ గడువు కొంత తక్కువగానే ఉంది.

భారీగా పెరిగిన వీసా ఖర్చులు..
వెయిటింగ్ గడువుతో పాటు వీసా ఖర్చులు కూడా భారతీయులకు ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. ప్రస్తుతం సాధారణ B1/B2 విజిటర్ వీసా ప్రాసెసింగ్ ఫీజు 185 అమెరికన్ డాలర్లుగా ఉంది. దీనికి తోడు అమెరికా కాంగ్రెస్ 2025 ఇమ్మిగ్రేషన్ చట్టం కింద కొత్తగా మరో 250 డాలర్ల 'వీసా ఇంటెగ్రిటీ ఫీజు'ను ప్రవేశపెట్టింది. ఈ అదనపు రుసుముతో వీసా ఖర్చు తలకు మించిన భారంగా మారుతోంది.

ఈ పరిణామాలతో అమెరికా వెళ్లాలనుకునే వారు చివరి నిమిషం వరకు ఆగకుండా చాలా ముందుగానే ప్లాన్ చేసుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. కొన్నిసార్లు కాన్సులేట్లు ముందు తేదీలలో స్లాట్‌లను విడుదల చేసే అవకాశం ఉంటుంది కాబట్టి.. ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ లభ్యతను చెక్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.