‘ఎవరు ఏమనుకుంటే నాకేంటి?’.. అమ్మ కోసం ఐటీ జాబ్ వదిలేసి ఆటో డ్రైవర్‌గా మారిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని !

‘ఎవరు ఏమనుకుంటే నాకేంటి?’.. అమ్మ కోసం ఐటీ జాబ్ వదిలేసి  ఆటో డ్రైవర్‌గా మారిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని !

కార్పొరేట్ ఉద్యోగం, చేతినిండా జీతం, ఏసీ ఆఫీస్.. కానీ, రాత్రిపూట నైట్ షిఫ్ట్‌లు, కంటిమీద కునుకు లేని జీవితం. మరోవైపు, ఇంటి దగ్గర  తండ్రి జ్ఞాపకాల మధ్య ఒంటరైపోయిన తల్లి ! సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే ఓ మాజీ ఐటీ ఉద్యోగిని ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఎవరు ఏం అనుకుంటే ఏంటి ? నా తల్లి రక్షణ, ఆమెతో గడిపే సమయమే నాకు ముఖ్యం.. అనుకుంటూ బెంగళూరులో ‘రాపిడో’ ఆటో డ్రైవర్‌గా కొత్త ప్రయాణం మొదలుపెట్టింది.

తండ్రి మరణం తర్వాత ఆమె జీవితంలో పెద్ద విషాదం ఏర్పడింది. ఐటీ కంపెనీలో రాత్రి షిఫ్ట్‌లు చేయడం వల్ల ఒంటరిగా ఉన్న తల్లితో కనీసం కాసేపు గడిపే అవకాశం కూడా లేకపోయింది..., దానికితోడు విపరీతమైన పని ఒత్తిడి, సమయం లేకపోవడం. దింతో ఏమాత్రం ఆలోచించకుండా తన కార్పొరేట్ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పేసి.. ఆటో స్టీరింగ్ పట్టి, తన జీవితానికి సరికొత్త మార్గాన్ని నిర్ణయించుకుంది.

సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ తన్వి బెంగళూరులో ఓ ఆటో ఎక్కినప్పుడు ఈ ఆసక్తికరమైన కథ బయటపడింది. “మీరు నిజంగానే ఐటీలో పనిచేసేవారా ?” అని తన్వి ఆశ్చర్యంగా అడిగినప్పుడు.. ఆ మహిళ  నవ్వుతో అవునని సమాధానమిచ్చింది.

"ఆటో నడపడం చిన్న  ఉద్యోగమేమీ కాదు. ఇక్కడ నాకు స్వేచ్ఛ ఉంది. నా తల్లితో గడపడానికి సమయం దొరుకుతోంది. నాకు కావాల్సిన స్వాతంత్య్రాన్ని నేను ఎంచుకున్నాను" అని ఆమె చెప్పిన మాటలు ప్రయాణికురాలినే కాక, ఇంటర్నెట్ లోని లక్షల మంది మనస్సులను గెలుచుకున్నాయి.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి మంచి  స్పందన లభిస్తోంది.

"అమ్మ కోసం అంత పెద్ద ఉద్యోగాన్ని వదిలేయడం నిజంగా గొప్ప విషయం.. ప్రాక్టికల్ లైఫ్‌లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికే అసలైన ధైర్యం కావాలి" అని కొందరు పొగడగా.... మరికొందరైతే, "ఉద్యోగులు కార్పొరేట్ కంపెనీల కంటే ఆటో నడుపుకోవడమే మేలని అనుకుంటున్నారంటే, అక్కడ ఎంతటి ఒత్తిడి ఉందో అర్థమవుతోంది" అని కామెంట్ చేశారు.

సమాజం ఏమనుకుంటుందో అని భయపడకుండా, కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుని, నచ్చిన దారిలో ముందుకు వెళ్తున్న ఈ మాజీ ఐటీ ఉద్యోగిని ఇప్పటి తరానికి నిజమైన స్ఫూర్తిగా నిలిచింది.