- 'తొలిముద్ద'తో అంగన్‌వాడీ చిన్నారులకు పోషక భరోసా
- పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క
ములుగు, వెలుగు: మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రజా ప్రభుత్వం నిరంతరం తోడ్పాటు అందిస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. సోమవారం ములుగు జిల్లాలో పర్యటించిన ఆమె స్వగ్రామం జగ్గన్నపేటలో ప్రధానమంత్రి సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం కింద రెండు గృహాలపై ఏర్పాటు చేసిన 2 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ప్రారంభించారు.
ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని ప్రయోగాత్మకంగా ఆదర్శ సౌర గ్రామంగా అభివృద్ధి చేసి, అనంతరం అన్ని గ్రామాలకు విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. జగ్గన్నపేటలో సౌర ప్లాంట్ల ఏర్పాటుకు 82 గృహాలను గుర్తించినట్లు తెలిపారు.
2 కిలోవాట్ల ప్లాంట్ ద్వారా నెలకు సుమారు 240 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, మిగులు విద్యుత్‌ను యూనిట్‌కు రూ.2.571 చొప్పున విద్యుత్ సంస్థకు విక్రయించి అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. అనంతరం ఉపాధి హామీ పథకం కింద రూ.10 లక్షలతో నిర్మించిన సీతారాముల మహిళా గ్రామ సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు.
కలెక్టరేట్‌లో ‘తొలిముద్ద’ అల్పాహార కార్యక్రమం, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్, టీ కేంద్రాన్ని కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుతో కలిసి ప్రారంభించారు. కొత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను రైతులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జాతీయస్థాయి కరాటే పోటీల్లో మూడో స్థానం సాధించిన జగ్గన్నపేట ఆశ్రమ పాఠశాల విద్యార్థినులను అభినందించారు.
‘తొలిముద్ద’తో పోషక భరోసా..
మూడు నుంచి ఆరేళ్ల చిన్నారులకు పౌష్టికాహారం అందించి ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు బాటలు వేయడమే ‘తొలిముద్ద’ కార్యక్రమం లక్ష్యమని సీతక్క అన్నారు. ములుగు సహా ఎంపిక చేసిన ఆరు జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లో గుడ్డుతో పాటు ఒకరోజు ఉప్మా, మరోరోజు కిచిడీ అందించనున్నట్లు చెప్పారు.
ములుగు జిల్లాలో ఇప్పటికే చిన్నారులకు 100 మిల్లీలీటర్ల పాలు అందిస్తున్నామని, ఇకపై పాలు, గుడ్లు, అల్పాహారం, మధ్యాహ్న భోజనంతో సంపూర్ణ పోషకాహారం అందుతుందని తెలిపారు. పోషకాహార లోపం ఉన్న చిన్నారులకు బాలామృతం, బాలామృతం ప్లస్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కిశోర బాలికలకు పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. మంత్రి, కలెక్టర్ చిన్నారులకు స్వయంగా అల్పాహారం తినిపించారు.
జర్నలిస్టులకు ఇంటి స్థలాలు..
ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఇంటి స్థలాల సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి సీతక్క తెలిపారు. అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించేలా ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. నూతన కలెక్టరేట్‌లో మీడియా ప్రతినిధులు మంత్రిని కలిసి ఇళ్ల స్థలాలు కేటాయించాలని వినతిపత్రం అందజేశారు.
ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో జర్నలిస్టులు కీలకపాత్ర పోషిస్తున్నారని సీతక్క పేర్కొన్నారు. కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్లు సీహెచ్.మహేందర్ జీ, సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, మున్సిపల్ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, వైస్ చైర్‌పర్సన్ ఆసియా షాహిన్ తదితరులు పాల్గొన్నారు.
