ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహారాజ్ గంజ్ ఫ్యామిలీ కోర్టు అది. ప్రియ, మనీష్ కుమార్ ఇద్దరు భార్యాభర్తలు. కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మధ్య గొడవలు. ఈ క్రమంలోనే విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటీషన్ దాఖలు చేశారు. 2026, సెప్టెంబర్ 24వ తేదీన భార్య ప్రియ, భర్త మనీష్ తోపాటు రెండు కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యులు ఫ్యామిలీ కోర్టులో విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం తర్వాత విచారణ ముగిసింది. అందరూ బయటకు వచ్చారు. ఈ సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరిగింది. ఆ తర్వాత కోర్టు ఆవరణలోనే బీభత్సంగా కొట్టుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మహారాజ్ గంజ్ ఫ్యామిలీ కోర్టులో విచారణ ముగిసిన తర్వాత భార్య ప్రియా తన తండ్రి, సోదరితో కలిసి విచారణకు హాజరయ్యింది. విచారణ సందర్భంగా అల్లుడు మనీష్ కుమార్ పై సాక్ష్యం చెప్పాడు ప్రియా తండ్రి. విచారణ వాయిదా తర్వాత అందరూ బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే కోర్టులో జడ్జి ఎదుట పిల్లనిచ్చిన మామ చెప్పిన మాటలను మనసులో పెట్టుకున్న అల్లుడు మనీష్ కుమార్.. భార్య ప్రియాతో గొడవ పడ్డాడు. మీ నాన్న ఇలా ఎందుకు చెప్పాడు.. తప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు అంటూ భార్య ప్రియాతో గొడవ పడ్డాడు. ఇది కాస్తా మాటామాటా పెరిగి.. కొట్లాటకు దారి తీసింది.
కోర్టు ఆవరణలోనే.. కోర్టు హాలు బయట భార్య ప్రియాపై దాడి చేసి కొట్టాడు భర్త మనీష్ కుమార్. ఇద్దరు బీభత్సంగా కొట్టుకున్నారు. అడ్డుకోబోయిన మామ, మరదలుపైనా దాడికి దిగాడు మనీష్ కుమార్. రెండు వర్గాలు కోర్టు ఆవరణలో పెద్ద కేకలతో.. అరుపులతో కొట్టుకున్నారు. విషయం తెలిసిన కోర్టు సిబ్బంది, అక్కడే ఉన్న పోలీసులు రెండు వర్గాలను అదుపులోకి తీసుకున్నాయి.
►ALSO READ | నీ కంటే పశువులు నయం: రద్దీ రైలు బోగీలోనే.. అందరి ముందు మూత్రం పోసిన వ్యక్తి !
కోర్టు ఆవరణలో జరిగిన ఈ ఘటనపై జడ్జి సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. భార్యభర్తలతోపాటు మిగతా వాళ్లపై కేసు పెట్టారు. భర్త మనీష్ కుమార్, మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. విడాకుల విచారణ కోసం కోర్టుకు వచ్చి.. కోర్టు ఆవరణలో బీభత్సంగా కొట్టుకున్న భార్యాభర్తల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
కొందరు నెటిజన్లు భార్య ప్రియ వైఖరిని తప్పుబడుతుంటే.. మరికొందరు భర్త తీరును తప్పుబడుతున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా.. కోర్టు ఆవరణలోనే ఇంతలా కొట్టుకున్నారంటే.. ఇక ఇంట్లో వీళ్లు రోజూ యుద్ధమే చేస్తున్నారు.. ఇంత జరిగిన తర్వాత విచారణ లేకుండా వెంటనే విడాకులు ఇవ్వాలంటూ న్యాయమూర్తికి సూచిస్తూ కామెంట్స్ చేయటం మరో విశేషం.
