రూ.1.5 లక్షల విలువైన బ్యాట్లు మాయం.. యోగీ వద్దకు పోవాలా, మోడీ దగ్గరకు వెళ్లాలా: దీపక్ చాహర్ కామెంట్స్ వైరల్

రూ.1.5 లక్షల విలువైన  బ్యాట్లు మాయం.. యోగీ వద్దకు పోవాలా, మోడీ దగ్గరకు వెళ్లాలా: దీపక్ చాహర్ కామెంట్స్ వైరల్

* ఆగ్రాలోని ప్రాక్టీస్ గ్రౌండ్‌ నుంచి రూ.1.5 లక్షల విలువైన మూడు బ్యాట్లు చోరీ
* పోలీసులను ఆశ్రయించాలా, యోగిజీ వద్దకు వెళ్లాలా.. మోడీని అడగాలా అంటూ ప్నశ్న
* వన్డేల్లో 16 వికెట్లు, టీ20ల్లో 31 వికెట్లు, ఐపీఎల్‌లో 127 వికెట్లు తీసుకున్న దీపక్ చాహర్

Deepak Chahar: టీమిండియా ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ క్రికెట్ మైదానానికి వెలుపల ఒక వింత సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆగ్రాలోని ప్రాక్టీస్ మైదానంలో సాధన చేసే సమయంలో ఆయనకు చెందిన మూడు విలువైన బ్యాట్లు దొంగతనానికి  గురయ్యాయి. దీనిపై సోషల్ మీడియాలో స్పందించిన చాహర్, తన ఆవేదనను వ్యక్తపరుస్తూనే నవ్వులు పూయించేలా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతున్నాయి. 

ప్రాక్టీస్ మైదానంలో చోరీ: 

ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న చాహర్-డావర్ మైదానంలో చోటు చేసుకుంది. ప్రాక్టీస్ సమయంలో బౌలింగ్ చేయడం కోసం దీపక్ చాహర్ తన కిట్ బ్యాగ్‌ను మైదానంలోనే పెట్టాడు. సుమారు గంట తర్వాత బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం వచ్చి చూడగా, కిట్ నుంచి మూడు ప్లేయర్-ఎడిషన్ బ్యాట్లు కనిపించలేదు. ఈ విషయాన్ని ఆయన తండ్రి, కోచ్ లోకేంద్ర చాహర్ కూడా ధృవీకరించారు. ఆ మూడు బ్యాట్ల మొత్తం విలువ సుమారు రూ. 1.5 లక్షలు ఉంటుందని దీపక్ పేర్కొన్నాడు. 

సోషల్ మీడియాలో విజ్ఞప్తి: 

బ్యాట్ల చోరీపై ఇన్స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్ చేసిన దీపక్ చాహర్.. నిన్న సాయంత్రం ఇక్కడి నుంచి నా 3 బ్యాట్లు దొంగిలించబడ్డాయి. ఇప్పుడు నేను ఏం చేయాలో మీరే చెప్పండి?, అవి చాలా మంచి బ్యాట్లు. దొంగిలించిన వ్యక్తికి వాటి విలువ ఎంతో కూడా సరిగ్గా తెలియకపోవచ్చు అన్నాడు. ఇక ఈ ఘటనపై నేను పోలీసులకు ఫిర్యాదు చేయాలా, యూపీ సీఎం యోగి జీ దగ్గరకు వెళ్లాలా లేక ప్రధాని నరేంద్ర మోడీ జీని కలవాలా? అంటూ సరదాగా ప్రశ్నించారు. బ్యాట్లు తీసుకున్న వ్యక్తి వాటితో టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడవచ్చు లేదా అమ్మేయవచ్చు, నిజంగా డబ్బులు అవసరమైతే నన్నే అడిగితే ఇచ్చేవాడిని కదా అని చెబుతూ తన బ్యాట్లను తిరిగి ఇచ్చేయాలని కోరాడు. కాగా, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక పోలీస్ ఫిర్యాదు చేయలేదని టాక్. 

దీపక్ చాహర్ కెరీర్: 

స్వింగ్ బౌలర్‌గా గుర్తింపు పొందిన దీపక్ చాహర్, అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడంతో పాటు ఐపీఎల్‌లోనూ కీలక బౌలర్‌గా రాణించారు. ఇక భారత్ తరఫున 13 వన్డేలు ఆడి 16 వికెట్లు తీశారు. 25 టీ20 మ్యాచ్‌లలో 31 వికెట్లు దక్కించుకున్నాడు. ముఖ్యంగా 2019లో బంగ్లాదేశ్‌పై సాధించిన 6/7 వికెట్ల ప్రదర్శన అతడి కెరీర్‌లోనే అత్యుత్తమంగా నిలిచింది. ఐపీఎల్‌లో 102 మ్యాచ్‌లు ఆడి 127 వికెట్లు సాధించారు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ లాంటి ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించారు.